Doctor Treats Covid Patients After He Lost Family Members
Doctor treats Covid-19 Patients : తన గుండెలోని బాధను దిగమింగి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్య సేవలందించాలనే బాధ్యతతో ముందుడుగు వేస్తున్నారు తుని పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సాయికిరణ్. ఈయన తల్లి కళావతి (58) కరోనాతో కొద్ది రోజులుగా విశాఖలో చికిత్స పొందుతూ ఈనెల 8వ తేదీన మృతి చెందారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, పీపీఈ కిట్ ధరించి తగిన జాగ్రత్తలతో తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. కొవిడ్‌తో బాధపడిన తన తల్లిని కాపాడుకోలేకపోయినా ఎదుటివారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించి వారి కుటుంబాలకు చేరువ చేయాలనే తపనతో ఆయన 10వ తేదీన తిరిగి విధులకు హాజరయ్యారు.
కరోనా రోగులకు వైద్యం అందిస్తుండగానే మంగళవారం మరో పిడుగులాంటి కబురొచ్చింది.పెద్దమ్మ జానకీదేవి (65) కూడా కొవిడ్‌తోనే కన్నుమూశారని తెలిసి మరింత ఆవేదనకు గురయ్యారు. అయినా తన బాధ్యతను గుర్తెరిగి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.