ఎక్కడకు వెళ్లవద్దు..ఇక్కడే ఉండండి..వలస కూలీలకు, ఇతరులను కోరుతున్న టి.సర్కార్

  • Publish Date - May 9, 2020 / 05:49 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు.. తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలంతా తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు.  దేశ వ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరళివెళ్తోంటే.. తెలంగాణలో మాత్రం రివర్స్‌ జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలసకూలీలు… తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. 

తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణ రంగంతోపాటు వివిధ రకాల పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. వీటిలో పనిచేసే కూలీలు, కార్మికుల కొరత ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు ఉపాధి కల్పిస్తామంటూ హామీనిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నవారు వెళ్లిపోవద్దని కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే పని కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

దీంతో తెలంగాణకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు క్యూ కట్టారు. బీహార్‌ రాష్ట్రంలోని ఖగారియా నుంచి కూలీలు నిన్న హైదరాబాద్‌కు వచ్చారు. శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 225మంది హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి అధికారులు రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. బీహార్‌ నుంచి వచ్చిన వలస కూలీలను పలు జిల్లాలకు పంపించారు. నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంచిర్యాల, సిద్దిపేటకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు.

వైద్య పరీక్షల నిర్వహణ తర్వాత వారిని ఆయా జిల్లాలకు తరలించినట్టు తెలుస్తోంది. కూలీలకు మంచినీళ్లు, ఫుడ్‌ ప్యాకెట్లు, మాస్క్‌లు అందజేశారు. వలస కూలీలేకాదు..  ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొస్తోంది. ముంబై, సోలాపూర్‌, కర్నాటక, కోల్‌కతా, ఢిల్లీ ప్రాంతాల్లో చిక్కుకున్న 75మందిని కూడా తెలంగాణకు తీసుకొచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర సోలాపూర్లో చిక్కుకున్న 68మంది యువతులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో స్వస్థలాలకు చేర్చారు.

Read More :

రండి..వచ్చేయండి : తెలంగాణకు వలస కూలీలు..పూలు చల్లి స్వాగతం

తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్న వలసకూలీలు