Egypt Train Crash
Egypt Train Crash: ఈజిప్టులో ఘోరం జరిగింది. రైలు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా..వందలాదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర కైరోలోని బన్తాలో ప్యాసెంజర్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం తలెత్తింది. దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళ్తున్న సమయంలో టోక్ అనే పట్టణం వద్ద హఠాత్తుగా నాలుగు భోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వందలాదిమందికి గాయాలయ్యాయి.
Egypt Train Crash
ప్రమాదంలో గాయపడినవారిని రక్షించేందుకు ఆంబులెన్స్, వైద్య సిబ్బంది హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం విషయం తెలియడంతో ఘటనా స్థలికి చేరుకున్న ప్రజలు ఎవరికి వారు ప్యాసెంజర్ రైలులో ఉన్న తమవారిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. రైలు పట్టాలు తప్పడానికి కారణాలింకా తెలియకపోగా రైలు డ్రైవర్, ఇతర సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Egypt Train Crash1
ప్రమాద సహాయక చర్యల్లో 60కిపైగా అంబులెన్స్‌లు పాలుపంచుకోగా.. గాయపడినవారిలో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించగా చాలామందికి కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించింది. రైలు ప్రమాదం ఈ దేశానికి కొత్తేమీ కాదు. గత రెండు నెలల్లో రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదాలకు మించి పట్టాలు తప్పిన ఈ ప్రమాదం భయానకంగా కనిపిస్తుంది.