×
Ad

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల కోలాహలం.. తేదీలు ఖరారు!

  • Published On : March 17, 2021 / 10:34 AM IST

Elections In Telugu States1

Elections in Telugu States: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం‌.. ఏపీలో తిరుపతి, తెలంగాణలో సాగర్‌ ఉప ఎన్నికకు నగారా మోగింది.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహాలం ప్రారంభం కాబోతుంది. తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 30న నామినేషన్లను స్వీకరించి… 31న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 17న పోలింగ్‌ నిర్వహించి, మే 2వ తేదీన ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల కమిషన్‌.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనాతో చనిపోగా.. లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉపఎన్నిక అనివార్యం అవ్వగా.. ఈ స్థానానికి వైసీపీ తరపున గురుమూర్తికి టికెట్‌ దక్కింది. మరోవైపు టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పనబాక లక్ష్మి బరిలోకి దిగుతోంది. బీజేపీ తరపున అభ్యర్థి ఎవరనేది ఖరారు కాలేదు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు తెలంగాణలో నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు. నోముల తనయుడు భగత్‌తో పాటు, గురవయ్యయాదవ్‌, రంజిత్‌ యాదవ్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో దిగుతుండగా.. జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని హైకమాండ్‌ ఫైనల్‌ చేసింది. బీజేపీ.. అభ్యర్థుల కోసం వడపోస్తుంది.