Elephants Attack Here Every Summer
Elephants Attacking: చలికాలం పోయి వేసవి కాలం వస్తుంటే చాలు ఇక్కడి ప్రజలలో భయం మొదలవుతుంది. సరిగ్గా మార్చి నెలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. చేతికొచ్చిన పంటలను గజరాజులు మూకుమ్మడిగా మందలుగా వచ్చి తొక్కి నాశనం చేస్తుంటే.. వాటికి కాపాడుకోవాలనే తపనలో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నా ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం మూడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజల ఆర్తనాదం ఇదే. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మూడు జిల్లాల సరిహద్దు రైతులను, ప్రజలను ఏనుగుల గుంపులు హడలెత్తిస్తున్నాయి. ప్రతి ఏడాది వేసవి కాలంలో మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు ఏనుగుల భయం వెంటాడుతూనే ఉంది.
మార్చి నెల అంటే మండు వేసవి. వేసవి తాపంతో అరణ్యంలో నీరు కరువై దాహార్తిని తీర్చుకునేందుకు ఏనుగులు గుంపులుగా పంట పొలాలు., అటవీ సమీప ప్రాంత గ్రామాల వైపు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు కర్ణాటక, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి ఫారెస్ట్ అధికారులే ఏనుగుల గుంపులను కౌండిన్య అటవీ ప్రాంతం వైపు తరిమేస్తున్నారని సమీప ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే ఏనుగుల గుంపులు కౌండిన్య అటవీ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా కౌండిన్య అడవీ ప్రాంతంలో వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏనుగుల దాడులు.. పంట పొలాల నాశనమై ఇప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్టాల అటవీ శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ఫలితం సూన్యం. ఎవరికి వారు ఆ ఏనుగులు మీ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో ఉన్నవేనని ఒకరిపై మరొకరు ఆరోపణలు దిగడం తప్ప ఏనుగుల కట్టడికి చర్యలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు, గ్రామస్థులు ఏనుగుల బారి నుంచి మమల్ని కాపాడాలని పలమనేరులోని ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి వెళ్ళేదే లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరికి స్థానిక సీఐ చొరవ తీసుకొని ప్రజలకు నచ్చజెప్పి నిరసన ముగించారు.
సరిగ్గా ఆ నిరసన జరిగిన 10 రోజుల అనంతరం తంజావూరు గ్రామం పరిధిలో ఏనుగుల గుంపులు దాడికి దిగాయి. పంట పొలాలను నాశనం మవుతుంటే చూడలేని రైతులు ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఏనుగు దాడిలో తీవ్రం గాయపడి అక్కడిక్కడే మరణించాడు. నిరసనల సమయంలో చర్యలు ప్రారంభిస్తే పంట నష్టంతో పాటు ఓ రైతు ప్రాణం నిలిచి ఉండేదని తంజావూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ ప్రాంతం చుట్టూ గంధకాలు త్రవించి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులను ప్రాధేయ పడుతున్నారు.