అరకు బస్సు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌, 30నిమిషాల్లోనే చేరుకున్న అంబులెన్స్‌లు

emergency response center araku bus accident: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్‌ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్‌ మలుపు దగ్గర లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందినవారు.

హైదరాబాద్‌లోని షేక్‌ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10న దినేష్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు (టీఎస్‌09-యూబీ 3729)లో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. గురువారం విశాఖ నగరంలోని వివిధ సందర్శనా ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా సింహాచలం బయలుదేరారు.

అప్పటివరకు సరదాగా సాగిన ఈ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 200 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలకు ఉపక్రమించారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు.

కాగా, ప్రమాదం జరిగిన నిమిషంలోనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ స్పందించింది. 30 నిమిషాల్లో అంబులెన్స్‌లు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. 200 అడుగుల లోయలో బోల్తా పడ్డ బస్సును గుర్తించిన రెస్క్యూ టీం.. పోలీసులు, స్ధానికుల సాయంతో ప్రమాద స్ధలం నుంచి 15 నిమిషాల్లోనే క్షతగాత్రులను శృంగవరపుకోట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించింది.

ప్రమాద ఘటన జరిగిన తేదీ – 12.02.2021

సంఘటన జరిగిన సమయం – 12 పిబ్రవరి సాయంత్రం 7.15 గంటలు

ఘటన జరిగిన ప్రాంతం – విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం తైడా, డముకు గ్రామాల మధ్య

ఘటన జరిగిన క్రమం – ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం స్పందించిన విధానం

12 ఫిబ్రవరి సాయంత్రం 7.15 గంటలకు హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు బస్సు యాత్రికులతో విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు వద్ద లోయలో బోల్తా పడింది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌కు 7.15 నిమిషాలకు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వైద్య సహాయం కోసం ఫోన్‌ కాల్‌ వచ్చింది.

క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ అనంతగిరి, అరకు వేలీ, జామి మండలాలకు చెందిన అంబులెన్స్‌లకు ప్రమాదం గురించి సమాచారం అందించింది.

ఏజెన్సీ, ఘాట్‌ ప్రాంతమైనా 30 నిమిషాలలోపే రాత్రి 7.45 గంటలకు ప్రమాద స్ధలానికి చేరుకున్న అంబులెన్స్‌లు.

ప్రమాదంలో బస్సు సుమారు 200 అడుగుల లోయలో పడినట్టు గుర్తించిన అంబులెన్స్‌ సిబ్బంది.

వెంటనే పోలీసులు, స్ధానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టిన అంబులెన్స్‌ వైద్య సిబ్బంది.

క్షతగాత్రులు సంఖ్య ఎక్కువగా ఉందని గ్రహించిన వెంటనే లక్కవరపుకోట, డుంబ్రిగూడకు చెందిన అంబులెన్స్‌లను కూడా ఘటనా స్ధలానికి పంపించిన అధికారులు.

సహాయక చర్యలకు సంబంధించి మరింత సమన్వయం కోసం అంబులెన్స్‌ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులతో పాటు జిల్లా మేనేజర్, జోనల్‌ మేనేజర్‌లను అప్రమత్తం చేసిన ఎమర్జెన్సీ రెస్క్యూ సెంటర్‌.

ముందుగా అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులందరినీ విజయనగరం జిల్లా శృంగవరపుకోట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించిన రెస్క్యూ టీం.

ఎస్‌.కోట సీహెచ్‌సీలో బాధితులకు ప్రాధమిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది.

తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తక్షణమే విశాఖపట్నం తరలించాలని నిర్ణయం.

దీనికోసం కొత్తవలస, గంట్యాడ, బొండపల్లి, ఎస్‌.కోట, పెందుర్తి, గాజువాకకు చెందిన అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచిన అధికారులు.

విశాఖ జిల్లా మేనేజర్‌తో మాట్లాడిన ఎమర్జెన్సీ రెస్క్యూ సెంటర్.

ఎమర్జెన్సీ రెస్క్యూ సెంటర్‌ నుంచి విశాఖ జిల్లా సిబ్బందితో సమన్వయం చేస్తూ…రాత్రి 8 గంటల నుంచి విజయనగరం జిల్లా ఎస్‌.కోట పీహెచ్‌సి నుంచి క్షతగాత్రులను ప్రత్యేక అంబులెన్స్‌లలో విశాఖపట్నం తరలింపు.

క్షతగాత్రులను ఎస్‌.కోట నుంచి విశాఖపట్నం తరలించే ఆపరేషన్‌లో పాల్గొన్న ఐదు అంబులెన్స్‌లు.

అనంతగిరి – AP 39TL8533

అరకు వేలీ – AP39TL8523

జామి – AP39TL 8519

లక్కవరపుకోట – AP39TL8517

డుంబ్రిగూడ – AP39TL8528

మొత్తం 24 మంది క్షతగాత్రులను శృంగవరపుకోట ప్రాధమిక ఆరోక్య కేంద్రం నుంచి విశాఖ కింగ్‌జార్జ్‌ ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ సిబ్బంది.
ప్రమాదం రాత్రిపూట జరగడం, 200 అడుగుల లోయలో బస్సు బోల్తా పడినా, చిమ్మ చీకట్లో తక్షణమే సహాయచర్యలు
సకాలంలో స్పందించిన స్ధానికులు, పోలీసులు.

15 – 20 నిమిషాలలోపే ఎస్‌.కోట సీహెచ్‌సీకి బాధితుల తరలింపు.

పోలీసు, మెడికల్ సిబ్బంది ఎమర్జెన్సీ సర్వీసులపై ప్రశంసలు.