తెలంగాణలో మరో డేరా బాబా…మహిళపై లైంగిక దాడి

  • Publish Date - July 11, 2020 / 12:33 PM IST

ఆధ్యాత్మిక ముసుగులో ఒక భక్తురాలిపై లైంగిక దాడి చేస్తున్న స్వామీజీ, అతడి శిష్యుడి బాగోతం తెలంగాణలోని దుబ్బాక పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

సిధ్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ కు చెందిన ఒక మహిళ సంతోషిమాత భక్తురాలు. ఆమెకు సంతోషిమాత గుడికట్టి సేవ చేయాలనే సంకల్పం చాలా రోజులుగా ఉంది.   చీకోడ్ లో  కొన్నేళ్లుగా  రఘు అనే వ్యక్తి  స్వామీజీ అవతారం ఎత్తి సమర్థ మహారాజ్ అనే పేరుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు .

చాలా మహిమ గల స్వామీజీ అని పేరు పొందాడు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆయన దర్శనం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో ఆ మహిళ కూడా ఒక సారి స్వామీజీని దర్శించి తన మనసులో ఉన్నసంకల్పాన్ని ఆయనకు చెప్పుకుంది. తన సంకల్పం నెరవేరేలా ఆశీర్వదించమని స్వామీజీని కోరింది.

తరచూ స్వామిజీ దర్శనానికి వెళుతూ ఉండేది. భక్తురాలి అమాయకత్వాన్ని పసిగట్టిన స్వామిజీ మనస్సు వక్రంగా ఆలోచించింది. రాత్రి పూట తన అనుచరుడు నరేష్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి మహిళతో మాట్లాడటం మొదలెట్టాడు. ఈ క్రమంలో… నీ సంకల్పం నెరవేరాలంటే నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను.  నన్నుసంతృప్తి పరిస్తే… నీ ఆలయ నిర్మాణ సంకల్పం నెరవేరుతుందని చెప్పాడు. ఈ విషయం ఎవరికీ చెప్పోద్దని ఒట్టు వేయించుకున్నాడు.

ఇది నిజమని నమ్మిన అమాయక మహిళ  అందుకు ఒప్పుకుంది. స్వామిజీ అనుచరుడు  నరేష్   రాత్రి పూట ఆమె ఇంటికి  వెళ్లి  తన కామ కోరికలు తీర్చుకు వస్తున్నాడు. కొన్నాళ్ళుగా ఆమెపై లైంగిక దాడి జరుగుతోంది. ఇన్నాళ్లుగా తాను స్వామీజీని సంతృప్తి పరుస్తున్నా తన సంకల్పం నెరవేరకపోయే సరికి ఆ మహిళకు స్వామిజీపై అనుమానం కలిగింది.

దీంతో తాను మోసపోయానని తెలుసుకుని దుబ్బాక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు ఆయన అనుచరుడు నరేష్‌పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ హరికృష్ణ చెప్పారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఇప్పడు తీవ్ర చర్చానీయాంశగా మారింది.