Farmer Diamond : పంట పండింది.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతు కూలీ

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు.

Farmer Diamond

Farmer Diamond : కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు. తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో పొలంలో పని చేసుకుంటుండగా, ఆ రైతుని మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది. వజ్రంగా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్థానిక వజ్రాల వ్యాపారికి చూపించాడు. అది రాయి కాదు విలువైన వజ్రం అని చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు.

దాన్ని రహస్యంగా వేలం వేయగా.. గుత్తికి చెందిన వజ్ర వ్యాపారి రూ.కోటి 25లక్షలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని సమాచారం. కాగా, మార్కెట్ ధర ప్రకారం 30 క్యారెట్ల బరువున్న ఆ వజ్రం విలువ రూ.3కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది.

రైతుకి ఖరీదైన వజ్రం దొరికిన వార్త సంచలనంగా మారింది. కాగా, అవకాశాన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు ఆ వజ్రాన్ని తక్కువ ధరకు కొన్నట్టు తెలుస్తోంది. డైమండ్ చూడటానికి చాలా చిన్నగా ఉంది. కానీ, దాని విలువ మాత్రం కోట్ల రూపాయల్లో ఉంది. ఆ వజ్రం కోసం ఇద్దరు వ్యాపారులు(అన్నదమ్ములు) పోటీ పడ్డారు. చివరికి కోటి పాతిక లక్షలకు దాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.

ఇదంతా అనధికారికంగా జరిగింది. ప్రతి ఏటా స్థానిక పంట పొలాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరుకుతుంటాయి. వ్యాపారులు వాటిని రహస్యంగా కొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందనే వాదనలు ఉన్నాయి.