కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకించిన రైతు సంఘాలు…ఈనెల 12న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు

  • Publish Date - December 9, 2020 / 05:49 PM IST

Farmers’ unions opposed central proposals : నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులను అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. సింఘూ సరిహద్దులో సమావేశమైన రైతు సంఘాల నేతలు చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.



మూడు చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాయి. రిలయన్స్ ఉత్పత్తులు వాడకూడదని రైతు సంఘాలు తీర్మానించాయి. సోమవారం నాడు ఢిల్లీలో రైతు సంఘాలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు. ఈ నెల 12న దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళనలు, ఢిల్లీ..జైపూర్ హైవే దిగ్బంధం చేయాలని తీర్మానించారు. ఈ నెల 14న బీజేపీ నేతల ఇళ్లు ముట్టడించాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 14న దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతాయని రైతులు చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.



కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చేశారు. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల ముందు కేంద్రం ప్రతిపాదనలు పెట్టింది. క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను క‌ల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు లేఖ రాసింది.

కావాలంటే లిఖిత‌పూర్వంగా కూడా తాము హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కూడా కేంద్రం వెల్లడించింది. కానీ మూడు వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌ల‌ను విర‌మిస్తామ‌ని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కేంద్ర ప్రతిపాదనకు నో చెప్పేశారు.



కేంద్రం ప్రతిపాదనల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణకు అంగీకరించింది. అలాగే ఏపీఎంసీలపై సవరణలకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రైవేటు కొనుగోలుదారులతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామంది. వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో సబ్ కలెక్టర్‌ అధికారాలకు సైతం అంగీకరించింది. కాంట్రాక్టు వ్యవసాయంలో రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా చట్టంలో సవరణ చేస్తామంది.



కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ చేయడానికి కేంద్రం అంగీకరించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.. కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు.