Northern California : ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు ; వేడి గాలులకు జనం విలవిల
గత 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద కార్చిచ్చు చెలరేగటం ఇదే తొలిసారి. కార్చిచ్చు కారణంగా లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమౌతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 12, 2021 / 05:32 PM IST
ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు
Northern California: అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలోని బ్యాక్ వర్త్ కాంప్లెక్స్ రీజియన్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. గత 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద కార్చిచ్చు చెలరేగటం ఇదే తొలిసారి. కార్చిచ్చు కారణంగా లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమౌతుంది. మరోవైపు తీవ్రమైన వేడిగాలుల కారణంగా డెత్ వ్యాలీ జాతీయ పార్క్ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 54 డిగ్రీల సెల్సీయస్ కు చేరుకున్నాయి.
కాలిఫోర్నియాలోని ఉత్తర పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగటంతో ముందు జాగ్రత్త చర్యగా 518 చదరపు మైళ్ళ పరిధిలోని ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా ఈశాన్య ప్రాంతంలో 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగసి పడుతున్నట్లు స్ధానిక అటవీ అధికారి కాక్స్ తెలిపారు. ఇప్పటికే 72కిలోమీటర్ల పరిధిలోని వృక్ష సంపదమొత్తం అగ్నికి ఆహుతై బూడిదైనట్లు చెప్పారు. వేడిగాలులు తట్టుకోలేని వారు నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.
అడవిలో కార్చిచ్చు కారణంగా అనే వన్యజీవులు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని సంరక్షణకు అన్ని రకాల చర్యలను అధికారులు చేపడుతున్నారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు అమెరికా అగ్నిమాపక దళాలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. మండలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ సాహసోపేతంగా కార్చిచ్చును అదుపు చేసే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాలతో వాటర్ ను తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
