Meira kumar on Rajasthan boy death: నా తండ్రికి స్కూల్లో నీళ్లివ్వలేదు.. 9 ఏళ్ల చిన్నారి మరణంపై మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ కుమర్తె భావోద్వేగ స్పందన

‘‘100 ఏళ్ల క్రితం మా నాన్న బాబు జగ్జీవన్ రాం కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితే ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఉండగా ఆధిపత్య వర్గాల కుండలోని నీళ్లు తాగకుండా ఆపేశారు. అయితే అప్పుడు ఆయన ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కానీ ఈరోజు ఇదే కారణం చేత 9 సంవత్సరాల దళిత బిడ్డ హత్య చేయబడ్డాడు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కులతత్వం మనకు పెద్ద శత్రువుగానే ఉంది. ఇది దేశానికి కళంకం’’ అని అన్నారు.

Rajasthan: రాజస్తాన్‭లోని జలోర్ జిల్లాలో 9 ఏళ్ల చిన్నారి మరణంపై మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కులతత్వం ఈ దేశానికి ఇంకా పెద్ద శత్రువుగానే ఉందని, ఇది దేశానికి కళంకం అని ఆమె అన్నారు. ఆమె తండ్రి, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాం చదువుకునే సమయంలో ఎదురైన ఇలాంటి అనుభవాన్నే గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఆ సమయంలో ఆయన హత్యకు గురి కాకుండా ఏదో ఒక రకంగా బయట పడ్డారని, కానీ స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత పునరావృతమైన అలాంటి సంఘటనలో చిన్నారి హత్య చేయబడ్డాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆమె సోమవారం తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘100 ఏళ్ల క్రితం మా నాన్న బాబు జగ్జీవన్ రాం కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితే ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఉండగా ఆధిపత్య వర్గాల కుండలోని నీళ్లు తాగకుండా ఆపేశారు. అయితే అప్పుడు ఆయన ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కానీ ఈరోజు ఇదే కారణం చేత 9 సంవత్సరాల దళిత బిడ్డ హత్య చేయబడ్డాడు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కులతత్వం మనకు పెద్ద శత్రువుగానే ఉంది. ఇది దేశానికి కళంకం’’ అని అన్నారు. ఇదే విషయమై మంగళవారం మీరా కుమార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మనం సాధించిన ప్రగతి ఇదేనని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో ఉన్న సురానా అనే గ్రామంలో జూలై 20న ఒక ప్రైవేటు స్కూలులో చదువుతున్న 9 ఏళ్ల బాలుడు.. స్కూల్లో ఉన్న నీటి కుండలోని నీళ్లు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ స్కూల్లోని టీచర్.. విద్యార్థిని చావగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని బుద్ధులు నేర్పే బడిలో జరిగిన దారుణం ఇది.

దీనికి ముందు ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతటి హృదయ విదారక సంఘటనను ఖండించడం చాలా తక్కువని, ఇలాంటివి రాజస్తాన్ రాష్ట్రంలో షరా మామూలు అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ రాజస్తాన్‭లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Bilkis Bano: బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల కాళ్లు తాకుతూ స్వీట్లతో స్వాగతం.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు