Bilkis Bano: బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల కాళ్లు తాకుతూ స్వీట్లతో స్వాగతం.. వీడియో వైరల్

2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతరితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. గోద్రా అల్లర్ల నుంచి తప్పించుకుని పారిపోయి ఒక గ్రామంలో ఆశ్రయం పొందిన సమయంలో జరిగిన ఘటన ఇది.

Bilkis Bano: బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల కాళ్లు తాకుతూ స్వీట్లతో స్వాగతం.. వీడియో వైరల్

Bilkis Bano: బిల్కిస్ బానో అనే గర్భిణిపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని అతి క్రూరంగా హత్య చేసిన 11 మంది దోషులు తాజాగా విడుదలయ్యారు. కాగా, వీరికి పాదాభివందనం చేస్తూ స్వీట్లు తినిపిస్తూ స్వాగతం పలకడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి వీరికి జీవిత ఖైదు శిక్ష పడినప్పటికీ రిమిషన్ పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో ప్రకారం.. నేరస్తులు వరుసగా నిల్చోగా, ఒక వ్యక్తి వారికి పాదాభివందనం చేస్తూ స్వీట్లు పంచాడు. అతడు వారి కుటుంబ సభ్యుడని సమాచారం. నేరస్తులను విడుదల చేయడమే కాకుండా ఇలా పబ్లిగ్గా వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడమేంటని నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఈ నేరస్తుల విడుదలపై తానేమీ స్పందించబోనని బిల్కిస్ బానో భర్త యాకుబ్ రసూల్ అన్నారు. ‘‘ఇప్పుడు దీని గురించి ఏమీ మాట్లాడలేము. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మావారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలేం. నా కూతురు సహా మిగిలిన వారిని ప్రతిరోజు స్మరించుకుంటాం’’ అని యాకుబ్ అన్నారు.

ఈ విషయమై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇదీ బీజేపీ ఆజాదీ కా అమృత్ వెర్ష‌న్. దారుణ హత్యకు పాల్పడ్డ దోషులను స్వేచ్ఛగా విడిచిపెట్టారు. ఒక మతం పట్ల బీజేపీకి ఎంతటి పక్షపాతం ఉందంటే.. క్రూరమైన అత్యాచారం, ద్వేషపూరిత నేరాలు కూడా క్షమించదగినవే అయ్యాయి. రుబినా మెమన్‭ కేసులో కూడా బీజేపీ-షిండే ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ దీనిని పరిగణలోకి తీసుకుంటుందా?’’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓవైసీ మండిపడ్డారు. మరో ట్వీట్‭లో ‘‘మహిళల గౌరవాన్ని తగ్గించే పని చేయబోమని ప్రతిజ్ణ చేయాలని ప్రధానమంత్రి భారతీయులను కోరారు. నారీ శక్తి అంటూ ఏవేవో గొప్ప మాటలే చెప్పారు. అదే రోజు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నేరస్థులను గుజరాత్‭లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. సందేశం సరిగానే ఉందిగా’’ అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతరితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. గోద్రా అల్లర్ల నుంచి తప్పించుకుని పారిపోయి ఒక గ్రామంలో ఆశ్రయం పొందిన సమయంలో జరిగిన ఘటన ఇది. ఆ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు.2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు.