ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ మే 31
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ మే 31 లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ప్రకటించింది. 2020 మే 31లోపు ఆస్తిపన్ను మొత్తాన్ని బకాయిలతోసహా చెల్లిస్తే 5శాతం తగ్గింపు వర్తింపజేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగంలో ఉన్నవారందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది. అంటే, ఇప్పటివరకు రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్నవారికే 5 శాతం రాయితీ ఉండగా.. తాజాగా నిర్ణయంతో ఆస్తిపన్ను ఎంతున్నాసరే.. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించనుంది.
జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎర్లీబర్డ్ ఆఫర్ వర్తింపు:
2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్‌పై పరిమితిని పురపాలకశాఖ తొలగించింది. ఇప్పటివరకూ కేవలం రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్నవారికే రాయితీ ఉండగా తాజాగా ఆ పరిమితిని ఎత్తివేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఆఫర్‌కు పెద్దగా ఆదరణ లేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని శనివారం(మే 9,2020) వీడియోకాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్లు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీంతో ఎర్లీబర్డ్ ఆఫర్‌ను జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపజేయాలని నిర్ణయించారు.
అన్ని పట్టణాల్లో 2019-20 ఏడాదిలో మార్చి 31 నాటికి ఆస్తిపన్ను 77.82% వసూలైంది. ఆ తర్వా త చెల్లిపు గడువు పొడిగించడంతో 78.96 శాతానికి పెరిగింది. 2018-19 సంవత్సరంలో 89% ఆస్తిపన్ను వసూలైంది. ప్రస్తుత ఏడాదికి ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్‌తో ప్రజలు మే 8 నాటికి సుమారు 8.34 శాతం ఆస్తిపన్ను చెల్లించారు.
ఈ పట్టణాల్లో వందశాతం వసూలు:
2019-20 ఏడాదిలో కోదాడ, కోరుట్ల, కొడంగల్ పట్టణాల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైంది. 50% లోపు వసూలైన పట్టణాల్లో వర్ధన్నపేట, వైరా, నందికొండ, చేర్యాల, కల్వకుర్తి ఉన్నాయి.