కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు ముప్పుగా మారింది. ఇప్పటికే లక్షల
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు ముప్పుగా మారింది. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. కరోనా వైరస్ మహమ్మారి ఎప్పుడు ఎలా సోకుతోంది, ఎటువైపు నుంచి దాడి చేస్తుంది అనేది అంతుచిక్కడం లేదు. దీంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇక కరోనా బారిన పడ్డ గర్భిణుల పరిస్థితి మరీ దారుణం. పుట్టబోయే బిడ్డకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనని తెగ భయపడుతున్నారు. పుట్టబోయే వారి క్షేమం గురించి తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ విషయం పెద్ద ఊరట ఇచ్చింది.
తల్లి పాలను తాకని కరోనా:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తల్లి పాలను తాకడం లేదని తేలింది. అంటే కొవిడ్-19 బాధిత గర్భిణులు ప్రసవించిన శిశువులకు పాజిటివ్ రావడం లేదు. అవును నిజమే. ఈ విషయాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ మహాలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అనిత తెలిపారు. బుధవారం(మే 13,2020) ఓ కరోనా పాజిటివ్ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చిందని, బిడ్డకు వైరస్ సోకలేదని డాక్టర్లు వెల్లడించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పారు.
బిడ్డకు కరోనా సోకకపోవడానికి కారణమిదే:
పాజిటివ్ సోకిన తల్లిపాలలో కొవిడ్-19 వైరస్ ఉండదని, ఆ తల్లి పాలను బిడ్డకు పట్టవచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు. వైరస్ గ్రంథుల నుంచి స్రవించే ద్రవాల్లో మాత్రమే.. అంటే చెమట, లాలాజలం వంటి వాటిలోనే ఉంటుందని డాక్టర్ అనిత తెలిపారు. గర్భస్థ శిశువుకుగానీ లేదా ప్లజెంటా (మాయ) ట్రాన్స్‌మిషన్‌కుగాని వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇది పేషెంట్‌తో పాటు వైద్య సిబ్బందికి పెద్ద చాలెంజ్ అని చెప్పారు. ఏ మాత్రం ఏమరపాటు జరిగినా బిడ్డకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందన్నారు. పాజిటివ్ గర్భిణికి జన్మించే శిశువుకు కరోనా సోకే అవకాశం ఒక్కశాతమేనని తేల్చిచెప్పారు.
మరో 8 మంది కరోనా బాధిత గర్భిణులకు చికిత్స:
గాంధీలో మొత్తం 10 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ప్రసవమైంది. పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా సోకలేదు. రెండ్రోజుల కిందట పాతబస్తీ బహుదూర్‌పురాకు చెందిన మరో గర్భిణి ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా అని తేలడంతో గాంధీకి తరలించారు. గర్భిణికి అధిక రక్తపోటుతోపాటు ఇది 6వ ప్రసవం. అయినా బుధవారం ప్రొఫెసర్ షర్మిల, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాణి బృందం శస్త్ర చికిత్స చేయగా.. మగబిడ్డ జన్మనిచ్చింది. మరో ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
తల్లీ బిడ్డ భౌతికదూరం పాటించాలి:
కరోనా పాజిటివ్ సోకిన తల్లి పాలలో కొవిడ్-19వైరస్ ఏ మాత్రం ఉండదు. ఆ తల్లి పాలను బిడ్డకు పట్టవచ్చు. కానీ భౌతికదూరం పాటించాలి. మాతా శిశువుల మధ్య దూరం అనేది చాలా ముఖ్యం. అందుకే తల్లికి నెగెటివ్ వచ్చే వరకు తల్లీబిడ్డను వేర్వేరుగా పెడుతాం అని గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మహాలక్ష్మి తెలిపారు.
తల్లిపాలలో లభించే యాంటీబాడీ కరోనాతో పోరాడుతుంది:
కరోనా వైరస్ సంక్రమణ నుంచి శిశువును రక్షించేందుకు తల్లిపాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని న్యూయార్క్‌లోని ఐకెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు గతంలో తెలిపారు. నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం బహిర్గతమైంది. తల్లిపాలలో లభించే యాంటీబాడీ కరోనాతో పోరాడేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దానిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ప్రొఫెసర్ రెబెకా పావెల్ కరోనా వైరస్ సోకిన మహిళల నుంచి పాలను సేకరించారు. తన కాలేజీ ల్యాబ్‌లో వైద్యుల బృందం తల్లిపాలలో రోగనిరోధక శక్తిపై పరిశోధనలు చేసింది. కరోనాతో పొరాడేందుకు తల్లి పాలలోని ప్రతిరోధకాల సామర్థ్యంపైనా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
శిశువుకి కరోనా రాకుండా తల్లిపాలు రక్షణ:
ఈ పరిశోధనల్లో తల్లి పాలివ్వడం ద్వారా కరోనా వైరస్ శిశువుకు సోకదని కనిపెట్టారు. తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. అది శిశువుకు సంక్రమించకుండా తల్లిపాలు కాపాడాతాయని తేల్చి చెప్పారు. యాంటీబాడీస్ శరీరంలో తయారయ్యే ప్రోటీన్లు.. శరీరానికి వెలుపల బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడే సామర్థ్యాన్ని పెంపొదిస్తాయని చెప్పారు. పావెల్ తన అధ్యయనంలో తల్లి పాలలో ఫ్లూ వంటి వైరస్‌లతో పోరాడేందుకు ప్రతిరోధకాలు ఉన్నాయని కనుగొన్నారు.
Read Here>> దేవుడా : ఇక గుళ్లో తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ ?