Asadudding Owaisi
Jammu Kashmir: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జమ్మూకశ్మీర్‌లో వరుసగా జరుగుతోన్న ఉగ్రదాడులపై ఆయన స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో 1987లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దాని ప్రభావం ఎలా ఉందో 1989లో చూశామని ఆయన చెప్పారు. కశ్మీర్ పండిట్లను ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు సంబంధించిన ఓ సమస్యగా చూస్తున్నారని, అంతేగానీ, వారిని మనుషులుగా చూడడం లేదని ఆయన అన్నారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వరుసదాడులు.. పాక్ కుట్రే: బీజేపీ
అప్పట్లో జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితుల గురించి స్థానిక రాజకీయ నేతలను మాట్లాడనివ్వలేదని ఆయన చెప్పారు. 1989లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన పొరపాట్లనే ఇప్పుడు మోదీ సర్కారు కూడా చేస్తోందని, ఇటువంటి చర్యలు ఉగ్రవాదానికి దారి తీస్తున్నాయని ఆయన అన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది మోదీ సర్కారేనని ఆయన చెప్పారు. ప్రభుత్వ చర్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, తాజాగా, జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాగా, 1989-1990 మధ్య కశ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున వలసలు వెళ్లారు.