MLA Rasamayi Balakishan : టీఆర్ఎస్ నేత, కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ తాకింది. డబుల్ లైన్ రోడ్డు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నేతలు బాలకిషన్ కాన్వాయ్ పై దాడి చేశారు. ఈ ఘటనలో బాలకిషన్ కు ఎలాంటి గాయాలు కాకున్నా.. ఏకంగా ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడికి యత్నం జరగడంతో గుండ్లపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గన్నేరువరం మండల కేంద్రంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డుతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కొంతకాలంగా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళ్తున్న రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే రసమయి తన కాన్వాయ్ ని ఆపకుండానే ముందుకు సాగారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దీంతో ఆందోళనకారులు కోపంతో ఊగిపోయారు. కనీసం మాకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడి చేశారు. రసమయి కాన్వాయ్ ని కొంతదూరం వరకు వెంటాడిన యువకులు కారుపై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. రసమయి కాన్వాయ్ ముందుకు వెళ్లేలా చేశారు. అనంతరం గన్నేరువరం పోలీస్ స్టేషన్ చేరుకున్న బాలకిషన్.. తనపై దాడికి యత్నించిన యువకులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ దగ్గర ఈ ఘటన జరిగింది.
కాగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బాలకిషన్.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.