బోయిన్‌పల్లి కిడ్నాప్ మాస్టర్‌మైండ్ శ్రీను, అఖిల ప్రియ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, లగ్జరీ జీవితం

bowenpally kidnap case  : బోయిన్‌పల్లి కిడ్నాప్ ముఠా నాయకుడు శ్రీనుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌లో గుంటూరుకు చెందిన మాడాల శ్రీను కీలకంగా వ్యవహరించాడు. భూమా అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా శీనుకు పేరుంది. నంద్యాల ఉపఎన్నికల్లోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. శ్రీను లగ్జరీ జీవితానికి సంబంధించిన వీడియో టెన్‌ టీవీ చేతికి చిక్కింది. హెలికాప్టర్లలో సరదాలు.. విలాసవంతమైన జీవితాన్ని శ్రీను గడిపేవాడు. బోయిన్ పల్లి కిడ్నాప్‌ ప్లాన్, రెక్కీ అంతా శీను కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు శ్రీను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్గవరామ్‌కు రైట్‌హ్యాండ్‌గా ఉంటున్న శీను.. గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు…

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న భూమా అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నాడని కౌంటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌పై కోర్టు విచారించనుంది.

రిమాండ్ రిపొర్టులో సంచలన విషయాలు : –
హఫీజ్ పేట భూ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి అనుచరులు ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందినట్లు గుర్తించారు. కిడ్నాప్‌ కేసు సూత్రధారి భూమా అఖిలప్రియేనని పోలీసులు నిర్థారించారు. భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియను ఏ1గా చూపిన పోలీసులు.. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2, భార్గవరామ్‌ను ఏ3గా రిమాండ్‌ రిపోర్టులో చేర్చారు. అలాగే శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

భూమా అఖిల ప్రియకు రిమాండ్ :-
భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. అంతకముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.