Haryana Farmers Died : దేశ రాజధానిలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్న హర్యానా రైతు (32) hypothermia కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో కదం తొక్కుతున్నారు. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌కు చెందిన Ajay More తోటి రైతులతో సింఘూ సరిహద్దు వద్ద 10 రోజులుగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు.
టిక్రీ బోర్డర్ వద్దనున్న TDI Parkలో పడుకుని ఉండగానే మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అజయ్‌కు వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలున్నారు. నిరసనలు ప్రారంభమైననాటి నుంచి కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం.
మంగళవారం దేశ వ్యాప్తంగా బంద్‌కు రైతు సంఘాలు పిలుపునివ్వడం, అన్ని పార్టీలు, నేతలు, ప్రజలు సపోర్ట్ చేయడంతో కేంద్రం ఒక రోజు ముందుగానే రైతులను చర్చలకు ఆహ్వానించింది. తాజాగా ప్రభుత్వం పంపనున్న ప్రతిపాదనలకు రైతులు అంగీకరిస్తే బుధవారం జరగనున్న క్యాబినెట్ భేటీలో రైతులకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతుల పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతం, కాంట్రాక్టు వ్యవసాయం అంశంలో రైతులు సివిల్ కోర్టులకు వెళ్లేందుకు అనుమతి సహా పలు రైతు డిమాండ్లకు ఒప్పుకునే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతల బృందం 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానుంది. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను సాయంత్రం 5 గంటలకు కలుసుకుని వివరించనున్నారు.