HeadLines: అసెంబ్లీ ఎన్నికలకు జనసేన సమాయత్తం.. ఎన్నికల నిర్వహణకు జోనల్ కమిటీలు

పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, రాయలసీమ 1,2 జోన్లుగా కమిటీలు వేసింది.

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జనసేన జోనల్ కమిటీలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జోనల్ కమిటీలు నియమించింది జనసేన. పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, రాయలసీమ 1,2 జోన్లుగా కమిటీలు వేసింది. జోనల్ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది.

పాపులారిటీ కోసమే నాపై ఆరోపణలు
కొంతమంది పాపులారిటీ కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. త్వరలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేస్తానని, వైసీపీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని కేశినేని నాని కొనియాడారు. ఒకప్పుడు చూసే వాళ్లం హరిజన వాడల్లోనో, ఊరి బయటనో అంబేద్కర్ విగ్రహాలు పెట్టేవారు. అటువంటి అంబేద్కర్ విగ్రహాలను రాష్ట్రం నడిబొడ్డున స్థాపించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కీర్తించారు కేశినేని నాని.

వైఎస్ షర్మిలకు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
కడప ఎయిర్ పోర్టులో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. షర్మిలకు పార్టీ నేతలు తులసి రెడ్డి, అహ్మదుల్లా వెల్ కమ్ చెప్పారు. షర్మిలతో పాటు కేవీపీ, రఘువీరా రెడ్డి కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్ పోర్టు నుంచి ఇడుపులపాయల వరకు ర్యాలీగా వెళ్లారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేకమైన ప్రార్థనల్లో షర్మిల పాల్గొననున్నారు. తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారు షర్మిల.

ఎన్నికల వేళ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి నిర్ణయం సరైంది కాదు
వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు తనకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పడమట సురేశ్ బాబు. గతంలో రెండుసార్లు అధిష్టానం నుంచి తనకు పెనమలూరు టికెట్ ఇస్తానని హామీ వచ్చిందన్నారు. అయితే ఆఖరి నిమిషంలో మంత్రి జోగి రమేశ్ పేరును తెరమీదకు తెచ్చారని చెప్పారు. ఎన్నికల వేళ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి నిర్ణయం సరైంది కాదని సురేశ్ బాబు అన్నారు.

చంద్రబాబుకు అంత బలం ఉంటే సొంతంగా పోటీ చేయొచ్చు కదా?
చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వ్యవసాయ రంగంలో టీడీపీ హయాంలో ఏం చేశారో, వైసీపీ హయాంలో ఏం చేశామో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబుకు అంత బలం ఉంటే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి. వైఎస్ఆర్ హయాంలోనే కియా పరిశ్రమకు బీజం పడిందన్నారు. ఎంత సేపూ హైదరాబాద్ ను డెవలప్ చేశా? ఐటీని డెవలప్ చేశా? అని అంటున్నారు కానీ.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాను, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ్యాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకొచ్చా, ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చంద్రబాబు చెప్పగలిగారా? చంద్రబాబు అంటున్నట్లు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తే మరి ఎందుకు తరిమేశారు? అని చంద్రబాబును నిలదీశారు మంత్రి కాకాణి.

ఏపీ మంత్రికి చేదు అనుభవం
అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ టూర్ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయనను అంగన్ వాడీలు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పుల పాలు చేశారు..
చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పుల పాలు చేశారని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. డబ్బులన్నీ హైదరాబాద్ లో దాచుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉంటున్న చంద్రబాబు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి వెళ్తున్నారని విమర్శించారు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ మనకు అక్కర్లేదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా పంపిణీ చేశారు.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్
లండన్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దానం నాగేందర్‌ అన్నారు. విదేశాలకు వెళ్లి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలని, ఇలా పొగరుగా మాట్లాడకూడదని వారు హితవు పలికారు. రేవంత్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారని అన్నారు.

బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. రెండు నియోజక వర్గాల పరిధి నేతలకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్టాక్‌ మార్కెట్లకు నేడు సెలవు లేదు 
స్టాక్‌ మార్కెట్లకు ఇవాళ కూడా పనిచేస్తాయని ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సాధారణంగా స్టాక్‌ మార్కెట్లకు శనివారం సెలవు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సారి శనివారానికి బదులుగా సోమవారం సెలవు దినంగా ప్రకటించారు.

రైళ్లకు అదనపు హాల్టులు
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అద్దె బస్సులపై పొన్నం వ్యాఖ్యలు
తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాగే, ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
తెలంగాణలోని గద్వాల పురపాలక సంఘం పరిధిలోని జమ్మిచేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జన్మదినోత్సవం వేళ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు డివైడర్‌‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.

నేడు ప్రధాన ఆలయంలోకి రాములోరి విగ్రహం
అయోధ్య రాముడి విగ్రహం నేడు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరానికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయోధ్యలోకి అనుమతించరు.

విధ్వంసం సృష్టిస్తాం
అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆయన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.

సస్పెన్షన్ వేటు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ సమయంలో విజయవాడ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యహరించిన ఆయన లాగిన్‌ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది.