Heavy To Very Heavy Rains For Another Three Days In Telangana
Weather Update: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురవగా శనివారం పలు చోట్ల జల్లులు కురిశాయి. ఇక, 11, 12, 13 వ తేదీలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఒకటి, రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వాతావరణ అధికారుల రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రాంతాలలో కురిసే చాన్స్ ఉంది. అలాగే రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కుమ్రంభీం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.