Hyderabad
Hyderabad: హైదరాబాద్ నగరంలో కొందరు హిజ్రాలు హల్చల్ సృష్టించారు. ఓ పెళ్లి ఇంట భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి హద్దులు మీరు భీభత్సం సృష్టించారు. దీంతో పెళ్లి ఇంటి వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా అదే రీతిలో రెచ్చిపోవడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నగరంలోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వినాయక్ నగర్ రోడ్డు నంబర్ 6 లోని ఓ పెళ్లి వారి ఇంటికి వెళ్లిన హిజ్రాలు రూ. 50 వేలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేమని పెళ్లి వారు చెప్పడంతో హిజ్రాలు అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని పెళ్లి వారి ముందే బట్టలు విప్పుతూ హంగామా సృష్టించారు. అడ్డుకున్న వారిపై దాడికి కూడా దిగారని పెళ్లి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడా వారిది అదే తీరు. పోలీసుల ముందే బట్టలు విప్పేసి నగ్నప్రదర్శన చేస్తూ వీరంగం సృష్టించారు. చివరికి పోలీసులే భయపడిపోయి హిజ్రాలపై ఐపీసీ 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినందుకు గాను నలుగురిపై ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్ మేనెజ్‌మెంట్ కింద మరో కేసు కూడా నమోదు చేశారు.