Himalayan unpredictable disasters: హిమాలయాల్లో జలప్రళయం..శాస్త్రవేత్తల సంచలన నివేదిక

వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో హిమాలయాల్లో ఏర్పడబోయే జల ప్రళయాల గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

హిమనీనదాలు కరిగితే జలప్రళయమే...సంచలన నివేదిక వెల్లడి

Himalayan Glaciers Melting unpredictable disasters: వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) మంగళవారం విడుదల చేసిన నివేదికలో హిమాలయాల్లో ఏర్పడబోయే జల ప్రళయాల గురించి(unpredictable disasters) శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే 65 శాతం వేగంగా అదృశ్యమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు.(Himalayan Glaciers Melting) హిమాలయాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పలు విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించారు.

మంచు కరిగితే విపత్తే…

ఉష్ణోగ్రత వేడెక్కుతున్నకొద్దీ మంచు కరుగుతుందనేది ఊహించిందేనని, ఇది ఆందోళన కలిగిస్తుందని శాస్త్రవేత్త ఫిలిప్పస్ వెస్టర్ చెప్పారు. మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా హిమాలయాల్లో మంచు కరిగి జలప్రళయాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు పర్వత ప్రాంతాల్లో నివశిస్తున్న 240 మిలియన్ల ప్రజలకు నదీ లోయల్లోని 1.65 బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన మంచినీటి వనరుగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్థుత వాతావరణ మార్పుల వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీనదాల ప్రస్తుత పరిమాణంలో 80 శాతం వరకు కోల్పోవచ్చని నేపాల్ శాస్త్రవేత్తలు చెప్పారు.

వాతావరణ మార్పులతో పెను ప్రమాదం…

హిమాలయ పర్వతాల్లోని హిమనీనదాలు కరిగితే వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తీరని నష్టమని శాస్త్రవేత్త ఇజాబెల్లా కోజియెల్ చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో అంగీకరించిన పారిశ్రామిక పూర్వ స్థాయి గ్లోబల్ వార్మింగ్ 1.5 నుంచి 2.0 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమైనప్పటికీ, హిమానీనదాలు 2,100 నాటికి వాటి పరిమాణంలో మూడింట నుంచి సగం వరకు కోల్పోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మెరుగుపడిన సాంకేతికత, హై రిజల్యూషన్ ఉపగ్రహ ఛాయాచిత్రాలను బట్టి హిమనీనదాలపై ఖచ్చితమైన అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచం వేడెక్కుతుండటంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని మహిళా శాస్త్రవేత్త అమీనా మహర్జన్ అంచనా వేశారు. వాతావరణ మార్పులతో జరిగే పెను ప్రమాదాలు ఊహించలేనివని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్లోబల్ వార్మింగ్ వల్లే  చమేలీ ఘటన

గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ పర్వతాలపై ఉన్న మంచు కరిగిపోతోంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీలో వచ్చిన జలప్రళయమే ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయంతో వందలాదిమంది మరణించారు. చమోలి జిల్లాలో ధౌలిగంగ నదిలో నీటి మట్టం హఠాత్తుగా పెరిగి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో రుషిగంగ డ్యామ్ తెగిపోయింది. పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరదనీరు పోటెత్తి రైనీ గ్రామం మునిగింది. నది తీరంలో ఉన్న ఇళ్లన్నీ వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 170 మంది సిబ్బంది గల్లంతయ్యారు.

హిమానీనదం ముక్కలైతే  కొండచరియలు విరిగిపడొచ్చు…

హిమానీనదం ముక్కలైనప్పుడు ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కొండచరియలు, బండరాళ్లు పడడం లాంటివి జరగవచ్చు. దానివల్ల పర్వతం వాలు మొత్తం కూలిపోయే అవకాశం కూడా ఉంది.2016వ సంవత్సరంలో టిబెట్‌లోని అరూ పర్వతంపై ఒక గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. దానివల్ల భారీగా మంచుచరియలు పడ్డాయి. 2012వ సంవత్సరంలో పాక్ పాలిత కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర జరిగిన ఒక ప్రమాదంలో 140 మంది మరణించారు.

శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తల అధ్యయనం 

1999 నుంచి 2018 వ సంవత్సరం వరకు కొండచరియలు విరిగిపడటానికి కారణం హిమానీనదాలు కరగడమేనని అమెరికా జియాలాజికల్ సర్వే శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు చెప్పారు.2009 నుంచి 2018 మధ్య మొత్తం 127 కొండచరియలు విరిగి పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.హిమాలయాల్లోని హిందూకుష్ ప్రాంతంలో 50 వేలకు పైగా హిమానీనదాలు ఉన్నాయి. ఈ హిమనీ నదాలు కరిగితే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.