Corona in Hyderabad: భాగ్యనగరంలో కరోనా ఊరట.. అందుబాటులోకి హాస్పటిల్ బెడ్స్!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. రోజు వారీ కేసుల నమోదును గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. మరో రెండు వారాలలో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

Corona in Hyderabad: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. రోజు వారీ కేసుల నమోదును గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. మరో రెండు వారాలలో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయడంతో పాటు ఇంటింటి సర్వే నిర్వహించి కేసులను ట్రాక్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఒకరకంగా కరోనా బాధితులకు ఊపిరి పీల్చుకొనే కబురే. రాష్ట్రవ్యాప్తంగా కేసులు తగ్గుతుండడం.. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడంతో కొంతమేర ఆసుపత్రులలో రద్దీలో మార్పు కనిపిస్తుంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో క్రమేపీ పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. నిజానికి మే రెండో వారం వరకు కూడా నగరంలోని ఆసుపత్రుల్లో పడకల కావాలంటే చాలా కష్టమయ్యేది.

హైదరాబాద్ వాసులతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి కూడా కరోనా రోగులు భాగ్యనగరానికి వచ్చేవారు. దీంతో ఆసుపత్రుల బెడ్స్ కొరత తీవ్రంగా కనిపించింది. ఒకదశలో తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కోవిడ్ రోగులను సరిహద్దులోనే ఆపేయగా చివరికి కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంతగా బెడ్స్ కొరతతో కొందరు రోగులు తప్పక ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయి మరణించిన వారు కూడా ఉన్నారు.

కాగా ఇప్పుడు నగరంలో సాధారణ, ఆక్సిజన్‌ పడకల లభ్యత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఐసీయూ పడకలకు మాత్రం అదే డిమాండ్‌ ఉందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పరిస్థితి విషయంగా ఉన్న రోగులు చివరిగా హైదరాబాద్ నగరంలో వైద్యాన్ని నమ్ముకుంటారు. బహుశా అందుకే ఐసీయూ బెడ్స్ కు ఇప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే.. మరో రెండు మూడు వారాలలో ఇది కూడా మరికాస్త డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు