ప్రైవేటు దవాఖానల్లో గదులు ఫుల్.. కరోనా రాకముందే ప్రీ-బుకింగ్‌!

  • Publish Date - July 3, 2020 / 07:02 AM IST

తెలంగాణలో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఈ వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న సమయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ప్రతి ఆసుపత్రి కూడా కిక్కిరిసి కనిపిస్తుంది. వైరస్‌ తమకెక్కడ సోకుతుందో అనే భయంతో కొందరు డబ్బున్న అతి జాగ్రత్తపరులు ముందుగానే ప్రైవేటు దవాఖానల్లో గదులను, పడకలను రిజర్వు చేసుకుంటున్నారు.

మాములుగా ప్రైవేటు ఆసపత్రులు అంటేనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకొనేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు నగరంలోని కొన్ని ఆసుపత్రులు అదే పని చేస్తున్నాయి. అదును చూసుకుని పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ పడకలు లేవంటూ రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని పేరు మోసిన ఆసుపత్రులు సైతం గేటు వద్ద ఏకంగా ‘హౌస్‌ఫుల్‌’ బోర్డులను పెట్టేశాయి.

అరకొరగా కొన్ని చోట్ల ఏవో చిన్న తప్పులు జరిగితే దానినే బూచిగా చూపెట్టి, సకల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులపై సోషల్ మీడియాలో జరిగిన విషప్రచారం కూడా ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆసుపత్రులు ఆ ప్రచారానికి కాస్త ఆజ్యం పోయడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇదే సమయంలో మాములు జ్వరంతో ఆసుపత్రికి వచ్చినా కూడా కొన్ని ఆసుపత్రులు రూ. లక్ష వరకు డిపాజిట్‌లు కట్టించుకుని చేర్పించుకుంటున్నాయి. హై రికెమెండేషన్ ఉంటే తప్ప సామాన్యులకు పడకలు ఇవ్వట్లేదు.

కరోనా రోగుల చికిత్సకు తాము ఖరారు చేసిన చార్జీలనే వసూలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ కొన్ని ఆసుపత్రులు దందా మొదలు పెట్టేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే రెండు రెట్లు అధికంగా చెల్లించి వైద్యం పొందుతున్నట్టు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు కొవిడ్‌ రోగి చికిత్సకు సంబంధించి వ్యక్తిగత గది రూ.5వేలు ఉంటే బ్లాక్‌లో రూ.10వేల నుంచి రూ.15వేలు వరకు ఆసుపత్రులు తీసుకుంటున్నాయి.

Read:తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు