Husband Killed Wife , After Wife Liquor Consuming
husband killed wife, after she taking liquor : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కొన్నాళ్లకే మోజు తీరిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎలాగోలా భార్యను వదిలించుకోవాలి అనుకున్నాడు. కానీ పెద్దలు అందుకు అంగీకరించక సయోధ్య కుదిర్చారు. ఇష్టంలేకపోయినా పెద్దలమాటకు మౌనంగా ఉన్నభర్త అదను చూసి ఆమెను హతమార్చాడు.
సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటి పోలీసు స్టేషన్ పరిధిలో సీతాఫల్ మండి, పార్టీవాడలో నివసించే సకత్వాల దర్శన్ ఈసీఐఎల్ లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను సౌందర్య(25) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది.
ఇటీవల కొంతకాలంగా భార్య భర్తలు తరచూ గొడవ పడుతున్నారు. భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం ఇరువైపులా పెద్దలకు తెలిసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ కలిసి ఉండేలా చేశారు. అయినా కానీభార్యను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు దర్శన్.
సోమవారం, మార్చి29 మధ్యాహ్నం భార్యా భర్తలిద్దరూ పూటుగా మద్యం సేవించారు. ఆసమయంలో భార్యసౌందర్య మరింత ఎక్కువ మద్యం సేవించేలా చేశాడు. మద్యం మత్తులో ఆమె స్పృహ కోల్పోయింది. సౌందర్య మెడకు టవల్ బిగించి హత మార్చాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.