Hyderabad : only women special parks in ghmc limits : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళల కోసం ప్రత్యేక పార్కులు త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పార్కుల్లోకి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండనుంది. పురుషులకు నో ఎంట్రీ. పార్కుల్లో మహిళల కోసం ఉమెన్ ఓరియెంటెడ్‌లో ప్రతిదీ ఆకట్టుకునే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
గ్రేటర్ మహిళల కోసం వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక పార్కులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇవి అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యమే పరమావధిగా జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం 55 చోట్ల వైవిద్యభరింతంగా ఉండేలా థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తోంది.
దీంట్లో భాగంగా.. శేరిలింగంపల్లిలోని టీఎన్జీవో కాలనీలో 18,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలోను, ఎల్బీనగర్‌లోని సచివాలయ కాలనీలో 4120 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ఉమెన్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కుల్లోకి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండనుంది.
కేపీహెచ్‌బీలో ఉమెన్స్ కం చిల్డ్రన్ పార్కు
తెలంగాణ హౌజింగ్ బోర్డు (టీహెచ్‌బీ) ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలో పార్కు నిర్మాణం కొనసాగుతోంది. ఇదీ కూడా త్వరంలోనే అందుబాటులోకి రానుంది. కేపీహెచ్‌బీ ఫేజ్-3లోని ఐఐజేఎం సర్కిల్‌లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉమెన్స్ కం చిల్డ్రన్ పార్కును అధికారులు డెవలప్ చేస్తున్నారు.
ఈ పార్కులో సెక్యూరిటీ రూం, చిన్నారులు ఆడుకునేందుకు ఆట స్థలం, మహిళలకు ప్రత్యేకంగా యోగా చేసుకోవటానికి ఓ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కును కూడా వచ్చే మే నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. ఈ పార్కులకు వచ్చే స్పందనను బట్టి సిటీలో మరిన్ని ఉమెన్స్ పార్కులను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.
పార్కుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఇలా ఉండనున్నాయి…
హ్యాండ్‌లూమ్, కల్చరల్ షోలు, గార్డెనింగ్, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్, హోం డెకర్స్, హ్యాండిక్రాఫ్ట్స్, ఫన్ క్లబ్, కిట్టి పార్టీ జోన్లతో పాటు గర్భిణులకు యోగా, ఇతర హెల్త్ సెక్షన్లు ఈ పార్కులలో అందుబాటులో రానున్నాయి. ప్రశాంత వాతావరణంలో మహిళలు పార్కులో గడిపేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే మే నెలాఖరు నాటికి ఈ పార్కుల్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.