Diabetes During Pregnancy : గర్భస్రావాన్ని నివారించాలంటే మధుమేహం విషయంలో గర్భిణీలు జాగ్రత్తలు తప్పనిసరి!

మధుమేహం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా గైనకాలజిస్టుతోపాటూ ఎండోక్రైనాలజిస్టు, డైటీషియన్‌ సలహాలు తీసుకుంటూ ఉంటే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా..గర్భస్రావం అవకుండా చూసుకోవచ్చు.

Diabetes During Pregnancy : గర్భిణుల్లో కనిపించే సమస్యల్లో మధుమేహం ఒకటి. ముందునుంచీ మధుమేహంతో బాధపడుతున్నా, లేదంటే ఆ సమయంలోనే కనిపించినా తగిన జాగ్రత్తలు పాటించటం మాత్రం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న తల్లికి బిడ్డ జన్మించినప్పుడు, శిశువుకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాలక్రమేణా, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం వల్ల సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మందులు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

గర్భధారణ సమయంలో రెండు రకాల మధుమేహం రావచ్చు. మొదటి రకంలో గర్భధారణకు ముందు మధుమేహం ఉండదు. గర్భధారణ సమయంలోనే ఇది వస్తుంది. ఈ రకమైన మధుమేహం మీ బిడ్డ పుట్టిన తర్వాత పోతుంది. రెండవ రకంలో గర్భం దాల్చడానికి ముందు మధుమేహం కలిగి ఉంటారు. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉండే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను ఉపయోగించడానికి శరీరానికి ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇన్సులిన్ షాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తాము తయారుచేసే ఇన్సులిన్‌ను ఉపయోగించలేరు. లేదంటే శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయదు. రక్తంలో చక్కెరను తగ్గించేందుకు ఇన్సులిన్ అవసరత ఉంటుంది.

మధుమేహం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా గైనకాలజిస్టుతోపాటూ ఎండోక్రైనాలజిస్టు, డైటీషియన్‌ సలహాలు తీసుకుంటూ ఉంటే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా..గర్భస్రావం అవకుండా చూసుకోవచ్చు. తల్లిలో అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. కాబోయే తల్లిలో ఇతర సమస్యలూ తగ్గుతాయి. తొమ్మిదినెలలు గడిచాక కూడా పాపాయి దక్కకపోవడం లాంటి సమస్యల్నీఅధిగమించవచ్చు.

నెలలు నిండకుండా కాన్పు అయ్యే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. పుట్టబోయే పాపాయికి దృష్టిలోపాలు ఎదురవకుండా, మెదడూ, వెన్నెముక, గుండె పనితీరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. ఒకవేళ రక్తంలో చక్కెరస్థాయులు సమతూకంలో లేకపోతే ఆ ప్రభావం మాయపై పడుతుంది. శరీరంలో అదనంగా ఇన్సులిన్‌ తయారీ అవసరం అవుతుంది. దాంతో బిడ్డ బరువు పెరుగుతుంది. ఫలితంగా కొన్నిసార్లు సహజ కాన్పు కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కాబోయే తల్లులకు గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నా ప్రసవం తరువాత అది తగ్గుతుంది.

ముందు జాగ్రత్తలు:

ఈ సమస్య ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరస్థాయుల్ని పరీక్షించుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారం.. వికారంతో అయ్యే వాంతుల్ని బట్టి గర్భిణికి ఇన్సులిన్‌ని ఎంత మోతాదులో ఇవ్వాలనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆహారంలో పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాలూ ఎక్కువగా ఉండాలి. ఓ పద్ధతి ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. ఫోలిక్‌యాసిడ్‌ లాంటి పోషకాలనూ వాడాల్సి ఉంటుంది. అలాగే నడక, యోగాసనాలు లాంటి వ్యాయామాలు వారంలో కనీసం ఐదురోజులు అరగంట చొప్పున చేయాలి. బిడ్డ ఆరోగ్యాన్ని గమనించేందుకు ఎప్పటికప్పుడు స్కాన్‌ చేయించుకోవడం కూడా అవసరం.

ట్రెండింగ్ వార్తలు