India – Australia 2nd Warm : ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే టెస్ట్ జట్టులో ఉన్న కొంత మంది ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌కు కోహ్లీసేన రెడీ అయ్యింది. సిడ్నీ మైదానంలో 2020, డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం నుంచి మూడు రోజుల వార్నప్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గులాబీ బంతితో భారత్ ప్రాక్టీస్ చేయనుంది.
తొలి వార్మప్ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత్‌కు ఓపెనింగ్ సమస్య వేధిస్తూనే ఉంది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ విఫలమయ్యారు. దీంతో మయాంక్‌కు తోడుగా ఇన్నింగ్స్ ఆరంభించే ఓపెనర్‌పై డైలమా నెలకొంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన రహానె, చెరో హాఫ్ సెంచరీలతో పుజారా, సాహా ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు విహారి కూడా రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో పంత్ బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడుతుందనే అంచనాలతో రెండో వార్మప్ మ్యాచ్‌లో అతణ్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి.
గత మ్యాచ్‌లో కొత్త బంతితో ఆకట్టుకున్న ఉమేశ్ తిరిగి టెస్టుల్లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలి. టెస్టుల్లో స్థానం కోసం పోటీపడుతున్న సిరాజ్ మరింత మెరుగ్గా బంతులేయాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. గత మ్యాచ్ లో తలకు బంతి తగలడంతో యువ ఓపెనర్ పకోస్కీ ఈ మ్యాచ్ కు దూరంగా ఉండనున్నాడు.