తొడగొడుతున్న వాయిసేన : ఇక చైనాకు చుక్కలే

  • Publish Date - July 5, 2020 / 09:29 AM IST

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్‌ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్‌ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన సన్నద్ధమవుతోంది.

బోర్డర్‌లో భారత విమానాలు గర్జిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎయిర్‌ఫోర్స్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించిన వ్యూహాత్మక ఆయుధాలకు తోడు మరికొన్ని అక్కడకు తరలిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి కీలకమైన అన్ని స్థావరాల్లో యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లు, రవాణా విమానాలను మోహరిస్తోంది.

C-17 గ్లోబ్‌మాస్టర్‌, సూపర్‌ హెర్క్యులస్‌ రవాణా విమానాలతో భారీగా ఆయుధాలును సరిహద్దు స్థావరాలకు తరలిస్తోంది. బలగాల తరలింపుకు ల్యూషిన్‌-76, ఆంటనోవ్‌-32 విమానాలను ఉపయోగిస్తున్నారు.  గాల్వాన్‌ లోయ ఘటన జరిగిన వెంటనే భారత వాయుసేన అప్రమత్తమైంది. సుఖోయ్‌ 30 MKI, జాగ్వార్‌, మిరాజ్‌ యుద్ధవిమానాలను సరిహద్దు స్థావరాలకు పంపింది.

అప్పట్నుంచి LAC వెంట మన విమానాలు గస్తీ తిరుగుతున్నాయి. వీటికి తోడు అపాచీ హెలికాఫ్టర్లు కూడా రౌండ్లు కొడుతున్నాయి. భారీ బరువులను మోసుకెళ్లగల చినూక్‌లు కూడా రంగంలోకి దిగాయి. చైనా ఏ మాత్రం తోక జాడించినా గట్టిగా బుద్ధి చెబుతామన్న సంకేతాలను భారత వాయుసేన పంపుతోంది. ఇప్పటికే చైనా సరిహద్దు వెంబడి భారీగా బలగాలను తరలించింది.

యుద్ధవిమానాలు, బాంబర్లను కూడా బోర్డర్‌కు 10కిలోమీటర్ల దూరం వరకూ తీసుకొచ్చింది. దీంతో భారత వాయుసేన తన అప్రమత్తతను మరింత పెంచింది. లడక్‌తో పాటు టిబెట్‌ రీజియన్‌లోని లేహ్‌, శ్రీనగర్‌తో పాటు అవంతీపూర్‌, బరేలి, అదమ్‌పూర్‌, హల్వారా, సిర్సా తదితర ఎయిర్‌బేస్‌ల్లో దళాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి.

సరిహద్దుల్లో పరిస్థితిని భారత్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇప్పటికే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌లు ఆ ప్రాంతంలో పర్యటించారు. యుద్ధసన్నద్దతను పరీక్షించారు. గస్తీ లోపాలను కూడా సవరించారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. దేశంలోని అన్ని బేస్‌లను అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మోదీ సరిహద్దు పర్యటనపై చైనా గుర్రుగా ఉంది. పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ పరిస్థితుల్లో చైనా మరిన్ని కవ్వింపు చర్యలకు దిగే అవకాశముందని భావిస్తున్నారు.