ఇండియా యంగ్ ఉమెన్ పైలెట్ గా కశ్మీర్ అమ్మాయి రికార్డు..15 ఏళ్లకే ఫ్లైయింగ్ లైసెన్స్..25ఏళ్లకే పైలెట్

India’s youngest women pilot : దేశంలోనే అతి చిన్న వయసులో పైలెట్ అయిన రికార్డు సృష్టించారు కశ్మీర్ కు చెందిన యువతి ఆయేషా అజీజ్. ఆమె వయసు 25 సంవత్సరాలు. 15 ఏళ్ల వయసులోనే ఫ్లైయింగ్ లైసెన్స్ పొందిన ఈ కశ్మీర్ అమ్మాయి..16 ఏళ్లకే రష్యాలోని సోకోల్ ఎయిర్ బేస్ లో మిగ్-29 జెట్ ట్రైనర్ ద్వారా ట్రైనింగ్ పొందారు. 2017లో ఆయేషా బాంబే ఫ్లయింగ్ క్లబ్ నుంచి వైమానిక రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అదే ఏడాది కమర్షియల్ లైసెన్స్ కూడా అందుకున్నారు.

దేశంలోనే అతి చిన్న వయసులో పైలెట్ అయిన రికార్డు క్రియేట్ చేసిన ఘనత సందర్బంగా ఆయేషా మాట్లాడుతూ..నాకు చిన్ననాటినుంచే ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఆకాశంలో చక్కర్లు కొట్టే విమానంలో ప్రయాణించటమంటే మరీ మరీ ఇష్టం.

విమానంలో ప్రయాణించటమంటే ప్రయాణీకురాలిలా కాదు పైలెట్ అయి విమానం నడపాలని కోరిక ఉండేది. అది ఎలాగైనా నెరవేర్చుకోవాలని కలలు కనేదాన్ని. పైలెట్ అయినతే ఎంతో మంది ప్రజలను కలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతోనే నేను పైలెట్ అవ్వాలనుకున్నాను. నా కలను నెరవేర్చుకున్నానని ఆయేషా తెలిపింది.

పైలెట్ అంటే 9 టూ 5 జాబు కాదు. ఎన్నో ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ భిన్న వాతావరణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని. వీటిన్నింటికి తాను సిద్ధపడే పైలెట్ అయ్యానని చెప్పారు ఆయేషా. పైలెట్ అంటే ఎన్నో ప్రాణాల్ని సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఎటువంటి అననుకూల పరిస్థితులు..వాతావరణాలు ఎదురైనా ప్రయాణీకుల ప్రాణాలకు సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని..దీనికోసం మానసికంగా బలంగా ఉండాలని తెలిపారు ఆయేషా అజీజ్.

కశ్మీరీ అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నారని..ముఖ్యంగా విద్యలో ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నారని..నేటి తరం యువత కేవలం ఉన్న ప్రాంతంలోనే ఉండాలని అనుకోవట్లేదు..కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి రాణించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కశ్మీర్ యువతులు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. కశ్మీర్ లో యువతులు, మహిళలు సగం మంది మాస్టర్స్ డిగ్రీ, లేక డాక్టరేట్ చేస్తున్నవారేనని ఆయేషా తెలిపారు.