JUDA Strike: సానుకూల స్పందన రాకపోతే అత్యవసర సేవలు కూడా బంద్!

ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండగానే తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్​ ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా జూడాలు విధులను బహిష్కరించారు.

Juda Strike

JUDA strike: ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండగానే తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్​ ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా జూడాలు విధులను బహిష్కరించారు. కొన్ని రోజులుగా తమ సమస్యల గురించి విన్నవించుకుంటున్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

మొత్తంగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు విధులను బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పెంచిన స్టైపండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూడాలు డిమాండ్​ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇలాంటి కష్టకాలంలో వైద్యులు ఇలా సమ్మెకి దిగడం సమంజసం కాదని పేర్కొనగా డాక్టర్లు ముందు విధులకు హాజరైతే సమస్యల పరిష్కారానికి మార్గం ఆలోచిస్తామని తెలిపారు. స‌మ్మె విర‌మించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించిన మంత్రి కేటీఆర్ వారి స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే.. జూడాలకు తోడుగా రేపటినుంచి రెసిడెంట్​ వైద్యులు కూడా విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామని జూడాలు స్పష్టం చేశారు. దీంతో జూడాల అంశం కాస్త సీరియస్ గా మారింది. ఒకవైపు కరోనా చికిత్సలో జూనియర్ డాక్టర్ల సేవలు అత్యంత కీలకం కాగా ఇప్పుడు వారే ఇలా సమ్మె బాట పట్టారు. సమ్మె విరమించకపోతే మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్లుగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయ మలుపులు కూడా తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.