Juhi Chawla Files Suit Against 5g Implementation In India
Juhi Chawla: టెక్నాలజీ కావాలని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. టెక్నాలజీ వలన వచ్చే అధిక రేడియేషన్ మీకు రోగాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఎప్పుడెప్పుడా అని ఇండియా ఎదురుచూస్తున్న 5జీ నెట్‌వర్క్‌ని వ్యతిరేకిద్దాం. దుష్ప్రభాలు తలెత్తే టక్నాలజీకి వ్యతిరేకంగా నడుంబిగిద్దాం. ఇది మేము అంటున్నది కాదు. బాలీవుడ్ నటి జుహీ చావ్లా అంటున్నారు. అనడమే కాదు ఏకంగా 5జీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
5జీ నెట్‌వర్క్ వలన వచ్చే రేడియేషన్ తో పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆమె తన పిటిషన్‌లో వాదించారు. ప్రస్తుతం మనం 4 జీ టెక్నాలజీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా 4జీలో కంటే వచ్చే 5జీలో 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంటుందని, ఇది మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని జూహీ పిటిషన్ లో కోర్టుకు వినిపించారు. ఆధునిక టెక్నాలజీకి తాను వ్యతిరేకం కాదంటూనే రేడియేషన్ కారణంగా తలెత్తబోయే తీవ్ర పరిణామాల గురించి అందరికీ తెలియాలని జూహీ కోరారు.
ఈ పిటిషన్ జస్టిస్ హరి శంకర్ ముందుకు రాగా ఆయన మరో ధర్మాసనానికి దీనిని బదిలీ చేశారు. మొత్తంగా పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జూన్ 2న విచారణ చేపట్టనుంది. 5జీ టెక్నాలజీ కారణంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించగా 5జీ రేడియేషన్ తో మనిషి డీఎన్ఏ, కణాలు, ఇతర అవయవాలు దెబ్బతినడమే కాక.. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జుహీ బలంగా వాదిస్తున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.