Kanaka Durgamma Temple Corona Agitation 43 People Tested Positive At Kanakadurga Temple
Kanaka Durgamma Temple: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుంటే ఆసుపత్రులలో బెడ్స్ సరిపోవడం లేదు. మరోవైపు స్మశాన వాటికల వద్ద అంబులెన్సుల క్యూలైన్లు హడలెత్తిస్తున్నాయి. ఇక్కడ అక్కడా అని లేకుండా ప్రధాన నగరాల నుండి పల్లెల వరకు కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల నుండి గుళ్ళు, ప్రార్ధనా మందిరాల వరకు మహమ్మారి వెంటాడుతూనే ఉంది.
తాజాగా విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిపై కరోనా పంజా విసిరింది. ఇంద్రకీలాద్రిపై ఒకేసారి 43 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణవడం సంచలనంగా మారింది. అందులో ఐదుగురు దుర్గగుడి అర్చకులు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారితో పాటు మరో 20 మంది బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా మిగతా వారు బిక్కుబిక్కుమంటూ విధులను నిర్వహిస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో కరోనా కలకలంతో భక్తులు ఇంద్రకీలాద్రి వైపు రాకపోవడంతో క్యూ లైన్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాలలో పరిస్థితి ఇంతే. టీటీడీ మొదలు చాలా దేవాలయాలలో భక్తుల దర్శనాన్ని తగ్గించేయగా శ్రీకాకుళం జిల్లాలో ఆలయాలలో దైవ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయంలో మే 10వ తేదీ వరకు నిత్య కైంకర్యాలు ఏకాంతంగా జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించేయగా నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూతో అన్ని ఆలయాలు రాత్రి దర్శనాలను నిలిపివేయనున్నారు.