గుడ్ న్యూస్, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి

  • Publish Date - May 6, 2020 / 03:51 AM IST

కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని కాదు, కరోనా దెబ్బకు అన్నీ మూతబడ్డాయి. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఉపాధి లేక ఆదాయం లేక అంతా విలవిలలాడుతున్నారు. కరోనా తీవ్రమైన ప్రభావం చూసిన వాటిలో టీవీ సీరియల్స్ ఒకటి. ఈ వైరస్ దెబ్బకు సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయాయి. సీరియల్స్ ప్రసారాలను టీవీలు ఆపేశాయి. లాక్ డౌన్ కారణంగా నెల రోజులకు పైగా షూటింగ్ లు బంద్ అయ్యాయి. కాగా, తాజాగా టీవీ సీరియల్స్ షూటింగులకు సంబంధించి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. టీవీ షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

షూటింగ్‌లో 12 మంది మాత్రమే ఉండాలి, బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లకు అనుమతి లేదు:
తక్కువమంది కళాకారులు, సాంకేతిక నిపుణులతో టీవీ సీరియల్స్‌ చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. టీవీ అసోసియేషన్‌తో కర్నాటక సీఎం యడియూరప్ప సమీక్షించారు. కరోనా నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ చిత్రీరకణ చేసుకోవటానికీ అంగీకరించారు. సీరియల్స్‌ షూటింగ్‌లో 12 మంది మాత్రమే ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లకు అనుమతి లేదని నిబంధన విధించారు. 

సీఎంను కలిసిన కన్నడ టీవీ రంగం అధ్యక్షుడు:
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇటీవలే కర్నాటక ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు సడలించింది. దీంతో కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు శివకుమార్ సీఎం యడియూరప్పను మంగళవారం(మే 5,2020) కలిశారు. మార్చి 22 నుంచి నిలిచిపోయిన టీవీ షోస్ షూటింగులకు అనుమతి ఇవ్వాలని సీఎంని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం యడియూరప్ప షూటింగులకు పర్మిషన్ ఇచ్చారు.

కరోనా కేసులు లేని ప్రాంతాల్లో సీరియల్స్ షూటింగులు:
”టీవీ రంగంపై 6వేల మంది ఆధారపడి ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లు నిలిచిపోవడంతో వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి జీవనంపై తీవ్రమైన ప్రభావం పడింది. దీనిపై సీఎంతో చర్చించాము. పరిస్థితులను ఆయనకు వివరించాము. షూటింగులు జరుపుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాం. కరోనా కేసులు లేని ప్రాంతాలు, కరోనా కేసుల సంఖ్య తక్కువ ఉన్న ప్రాంతాల్లో షూటింగులు జరుపుకునేందుకు సీఎం పర్మిషన్ ఇచ్చారు” అని కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు.

పాత సీరియల్స్ నే ప్లే చేస్తున్న టీవీ చానెళ్లు:
మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి అన్ని రకాల సినిమా షూటింగ్‌లు, టీవీ సీరియల్ షూటింగ్‌లు నిలిచిపోయాయి. అప్పటి వరకు చేసిన షూటింగ్ పార్ట్‌లు ఎడిటింగ్ చేసి ప్రసారం కూడా చేశారు. ఆ తర్వాత సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నటులు, సాంకేతిక సిబ్బంది, ఇతరత్రా సినిమాలు, షూటింగ్‌ల మీద ఆధారపడి జీవించే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వారిని నిలుపుకోవడానికి పాత సీరియల్స్‌నే మొదటి నుంచి ప్లే చేస్తున్నాయి కొన్ని టీవీ చానళ్లు.

Also Read | తలసానితో నిర్మాతలు భేటి.. జూన్ రెండో వారం నుండి షూటింగులకు అనుమతి?