మెట్టుదిగడం లేదు : చట్టాలను రద్దు చేయాల్సిందే – రైతులు

  • Publish Date - December 11, 2020 / 07:18 AM IST

laws must be repealed – farmers : అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు మెట్టు దిగడం లేదు.. బెట్టు వీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అభ్యంతరాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినా.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కేంద్రం మరోసారి రైతులను ఆహ్వానించినా.. చర్చలకు ససేమీరా అన్నాయి రైతు సంఘాలు. రైతులకు మండీల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించేందుకే కొత్త చట్టాలను తెచ్చినట్లు పేర్కొంది



కేంద్రం. రైతుల భూముల లీజు, ఒప్పందాలపై కొత్త చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవని, ఎంఎస్‌పీ కొనసాగుతుందని కేంద్ర చెప్పుకొచ్చింది. ఈ చట్టాల్లోని ఏ నిబంధనలు తమకు నష్టం కలిగిస్తాయని రైతులు భావిస్తున్నారో, ఆ నిబంధనలపై చర్చలకు సిద్ధమని తెలిపింది. రైతులు తమ ఆందోళన విరమించుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. మరోవైపు చట్టాలను కచ్చితంగా రద్దు చేయాల్సిందే అంటున్నాయి రైతు సంఘాలు.



డిసెంబర్ 10లోగా రైతు చట్టాల రద్దుపై కేంద్ర నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 12, 14న రైతుసంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు 10 ట్రేడ్్ యూనియన్లు మద్దతు తెలిపాయి. కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య ఆరు దఫాలుగా చర్చలు జరిగినా అసంపూర్తిగానే ముగిశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు.