కొత్త కొత్తగా Lockdown 4.0 : మే 31 వరకు లాక్ డౌన్!

  • Publish Date - May 17, 2020 / 01:42 AM IST

కరోనా రాకాసి వల్ల భారతదేశంలో ఇంకా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు సార్లను పొడిగించిన కేంద్రం..మరోసారి కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తోందని సమాచారం. లాక్ డౌన్ 4.0 2020, మే 31 వరకు ఉండనుందని సంకేతాలు ఇచ్చింది కేంద్రం. కానీ..ఈసారి కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 2020, మే 17వ తేదీ ముగియనుంది. ఈ క్రమంలో 17వ తేదీ ఆదివారం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కంటైన్ మెంట్ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం. 

రెడ్ జోన్లలో నిబంధనలు మార్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 4.0లో ఫ్యాక్టరీలో మరింత సిబ్బంది (33 శాతం కంటే ఎక్కువ)ని పనుల్లోకి తీసుకొనే ఛాన్స్ ఉందని సమాచారం. కరోనా వ్యాప్తి నియంత్రణకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేపట్టిన చర్యలను అధికారులు సమీక్షించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మే 16వ తేదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లు ఉన్నాయి.

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు…పట్టణ ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనుంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సెక్షన్‌ 144ను అమలు చేయాలని సూచించింది. నగరాల్లో ప్రజలు ఎక్కువగా సంచరిస్తున్నారని, దీనిని అరికట్టాలని వెల్లడించింది. మరి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయనుందనేది తెలియాలంటే..కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.