గ్రేటర్ ఆర్టీసీ రెడీ..ప్రధాన రూట్లలోనే బస్సులు!

  • Publish Date - May 17, 2020 / 12:51 AM IST

కరోనా వైరస్ కారణంగా నష్టాల్లోకి వెళ్లిన TSRTC మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకొనేందుకు రెడీ అవుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత..రోడ్లపైకి బస్సులు తీసుకొచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో 50 రోజులకు పైగానే..బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

లాక్ డౌన్ ఎత్తివేతతో పాటు…ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే…బస్సులు నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందుకు అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు స్టడీ చేస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా..ప్రయాణీకులు పాటించాల్సిన పద్ధతులను ఖరారు చేస్తున్నారు. 

గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో 29 బస్సు డిపోలున్నాయి. కానీ..ప్రధాన రూట్లలోనే బస్సులు తిప్పుతారని, కాలనీల్లోకి వెళ్లవని తెలుస్తోంది. భౌతిక దూరం పాటించేందుకు బస్సుల్లో 70 మందిని ఎక్కించుకోకుండా..కేవలం 30 మందిని మాత్రమే అనుమతినిస్తారని తెలుస్తోంది. ఇద్దరే కూర్చొనే విధంగా సీట్లను ఏర్పాటు చేస్తారని, సీట్ల మధ్యలో ఒక్క ప్రయాణీకుడికి స్టాండింగ్ చేసే అవకాశాన్ని ఇస్తారని సమాచారం. 

ప్రతి స్టేజీకి ఇద్దరు కండక్టర్లను నియమించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక కండక్టర్ టికెట్ ఇచ్చి డబ్బులు వసూలు చేస్తారు. మరో కండక్టర్ బస్సు దిగి ప్రయాణీకులు వారు ఎక్కిన స్టేజీలో టికెట్ తీసుకున్నారో లేదో చెక్ చేస్తారు. డ్రైవర్..కేటాయించిన డోర్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. రెండు షిప్టులుగా కండక్టర్లు, డ్రైవర్లను ఉపయోగించనున్నారు. ప్రతి రూట్ బస్సులకు వేర్వేరుగా కండక్టర్లు టికెట్ ఇస్తారు. ఇక్కడ ప్రయాణీకులు బస్సు ముందు నుంచే దిగాల్సి ఉంటుంది. మరి లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో..ప్రభుత్వం ఆదేశాలు ఎప్పుడు ఇస్తుందో వేచి చూడాలి.