రాత్రంతా కారులోనే, డాక్టర్ కుటుంబంతో అమానుషంగా ప్రవర్తించిన గ్రామస్తులు

ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర

  • Publish Date - May 11, 2020 / 04:22 AM IST

ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర

ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. దేశం మొత్తం డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలను కీర్తిస్తున్న తరుణంలో ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ కుటుంబం పట్ల గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. డాక్టర్ కుటుంబం ఊరిలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో డాక్టర్ కుటుంబం రాత్రంతా నడిరోడ్డుపై కారులోనే గడపాల్సి వచ్చింది.

కరోనా భయంతో డాక్టర్ కుటుంబాన్ని అడ్డుకున్న గ్రామస్తులు:
భువనేశ్వర్‌లో ఆదివారం(మే 10,2020) రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె పేరు రాఖీ సింఘ్‌. ఆయుష్ డాక్టర్. హైదరాబాద్ నుంచి ఒడిశాలోని స్థానిక గొండార్ పూర్‌ గ్రామానికి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్లారు. డాక్టర్, భర్త, ఇద్దరు పిల్లలు కారులో ఉన్నారు. అయితే గండార్ పూర్ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. కరోనా వైరస్ భయంతో వారిని ఊరిలోకి రానివ్వ లేదు. అనుమతి పత్రాలు చూపించినా గ్రామస్తులు వారిని గ్రామంలోనికి వెళ్లనివ్వలేదు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు పంతం వీడలేదు. చివరికి సర్పంచ్‌, పోలీసులు నచ్చచెప్పినా గ్రామస్తులు పంతం వీడలేదు. దీంతో వైద్యుని కుటుంబసభ్యులు రాత్రంతా కారులోనే గడపాల్సి వచ్చింది.

గ్రామస్తుల తీరుపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన డాక్టర్:
దీనిపై డాక్టర్ రాఖీ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారని వాపోయారు. ఒకనొక సమయంలో సర్పంచ్‌, పోలీసులు కూడా తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని రాఖీ సింఘ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యలకు నిరసనగా డాక్టర్‌ కుటుంబం రాత్రంతా కారులోనే ఉండిపోయింది. ఉదయం కొందరు గ్రామస్తులు తమ కారుపైకి రాళ్లు రువ్వినట్లు డాక్టర్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంట నగరాల పోలీసు కమిషనర్‌ సుధాంశు షడంగికి డాక్టర్ రాఖీ ఫిర్యాదు చేశారు.

డాక్టర్ కుటుంబాన్ని తిప్పలు పెట్టిన పోలీసులు, సహాయ నిరాకరణ:
తెల్లారక డాక్టర్ రాఖీ పోలీసులను ఆశ్రయించారు. వారు గండార్ పూర్ లోని ఓ స్కూల్ లో క్వారంటైన్ లో ఉండాలని చెప్పడంతో డాక్టర్ కుటుంబం అక్కడికి వెళ్లింది. అక్కడికి కూడా వచ్చిన గ్రామస్తులు డాక్టర్ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై రాళ్లు విసిరారు. అంతేకాదు సజీవదహనం చేస్తామని హెచ్చరించారు. దీంతో డాక్టర్ రాఖీ కుటుంబం భయాందోళనకు గురైంది. వెంటనే వారు డీసీపీ అధికారిని కలిసి సాయం చేయాలని అడిగారు. ఆ అధికారి డాక్టర్ ఆధార్ కార్డుని పరిశీలించారు. అందులోని అడ్రస్ ఆధారంగా చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కలవాలని చెప్పారు. దీంతో డాక్టర్ కుటుంబం చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సాయం కోరింది. అయితే వారికి నిరాశే ఎదురైంది. పోలీసులు సైతం ఎలాంటి సాయం చేయలేదు. 

ముందుకు పోలేక, వెనక్కి రాలేక నరకయాతన:
దీంతో హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు తమకు పర్మిషన్ ఇవ్వాలని డాక్టర్ కుటుంబం కోరగా దానికి కూడా పోలీసులు నిరాకరించారు. చివరకు చేసేది లేక నందన్ కన్ పోలీస్ స్టేషన్ కు తిరిగి వచ్చింది డాక్టర్ కుటుంబం. ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉండాలని పోలీసులు వారికి సూచించారు. దీనికోసం రోజుకు రూ.1800 ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందుకు డాక్టర్ కుటుంబం నిరాకరించింది. దీంతో పోలీసులు స్థానిక కాలేజీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో కమిషనర్ సుధాంశు స్పందించారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయన్నారు. అవసరమైతే డాక్టర్ కుటుంబాన్ని అడ్డుకున్న గ్రామస్తులపై కేసు నమోదు చేస్తామని కమిషనర్ చెప్పారు.

దీనిపై గ్రామ సర్పంచ్ వివరణ ఇచ్చారు. గ్రామస్తులను సర్పంచ్ వెనుకేసుకొచ్చారు. వారు చేసిన దాంట్లో తప్పు లేదన్నారు. డాక్టర్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చూస్తే ఆ డాక్టర్ ది ఈ ఊరే కాదని, అందకే ఊరిలోకి రానివ్వడం సాధ్యం కాలేదన్నారు. 

Read More :

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు

తెలంగాణలో రేపటి నుంచి ప్లాస్మా థెరపీ