సామాన్యుడికి మరో బిగ్ షాక్, ఆ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ ఏకంగా రూ.95 పెంపు

lpg cylinder price hike: ఇప్పటికే భగ్గుమంటున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడికి.. వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపు రూపంలో మ‌రో షాక్ త‌గిలింది. చమురు కంపెనీలు వంట గ్యాస్ ధర పెంచాయి. వంట గ్యాస్ ధరను రూ.25 పెంచిన చమురు కంపెనీలు.. వాణిజ్య(కమర్షియల్) గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ కూడా పెంచాయి. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను ఏకంగా రూ.95 పెంచాయి. దీంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

3 నెలల వ్యవధిలో రూ.225 భారం:
చమురు కంపెనీలు నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచినట్లు అయ్యింది. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారంమోపాయి. ఫిబ్రవరిలో సిలిండర్‌ ధరలను మూడు సార్లు సవరించిన విషయం తెలిసిందే. ఆ నెలలో మొత్తంగా రూ.100 అధికమైంది. 2020 డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు(3 నెలల వ్యవధిలో) వంటగ్యాస్‌పై రూ.225 పెరిగింది.

కంటిన్యూగా గ్యాస్ బాదుడు:
2020 డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర 50 పెంచడంతో రూ.594 నుంచి రూ.644కి పెరిగింది. ఆ తర్వాత జనవరి 1న 50వడ్డింపుతో.. రూ.644 నుంచి రూ.694కు పెరిగింది. ఫిబ్రవరి 4న ధ‌ర‌ రూ.719కి(రూ.25 పెంపు) చేరింది. అదేనెలలో పదిరోజుల వ్యవధిలోనే మరో రూ.50 మేర వినియోగదారులపై భారం మోపాయి. ఫిబ్రవరి 15న రూ.769(రూ.50 పెంపు) చేరింది. చివరగా ఫిబ్రవరి 25న రూ.25 మేర గ్యాస్‌ ధరను అధికం చేయడంతో రూ.794కు చేరింది. తాజాగా మరో రూ.25(మార్చి 1,2021) వడ్డించడంతో ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఇక వాణిజ్య సిలిండర్‌పైనా రూ.95 పెరగడంతో సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది.

ట్రెండింగ్ వార్తలు