Maharashtra village sarpanch post auctioned :‘పదవి’ కోసం కోట్లాది రూపాయలకు మంచినీళ్లల్లా ఖర్చుపెట్టేస్తున్నారు నేతలు. ఎమ్మెల్యలే, ఎంపీ పదవులకే కాదు కేవలం గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవులకు కూడా కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారంటే ‘పదివి’అనేది ఎంత వ్యామోహమో అర్థం చేసుకోవచ్చు. ఓ గ్రామంలో సర్పంచ్ పదవికోసం ఏకంగా ఓ వ్యక్తి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అదికూడా ఎలక్షన్ కోసం కాదు. వేలం పాటలో సర్పంచ్ పదవి దక్కించుకోవటం కోసం..!!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ పరిధిలోని ఉమ్రానే అనే గ్రామంలో సర్పంచ్ పదవి కోసం గ్రామస్తులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో విశ్వాస్ రావ్ దేవ్ అనే వేవ్లాలీ గ్రామస్థుడు రూ.2 కోట్ల 5 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. ఎన్నికలు లేకుండా వేలం పాటలో సర్పంచ్ ను దక్కించుకోవాలనుకున్నవారు ఈ వేలం పాటలో పాల్గొన్నారు.
అలా వేలం సర్పంచ్ పదవి కోసం మొదలైన వేలం పాట రూ.1 కోటీ 11 లక్షలకు ప్రారంభమైంది. ఈ వేలం పాట ప్రారంభమైన దగ్గరనుంచి ఉత్కంఠభరితంగా సాగింది. పదవిని దక్కించుకోవటానికి పలువురు గ్రామస్తులు పాట పాడుతునే ఉన్నారు. డబ్బులు పెరుగుతునే ఉన్నాయి.
అలా పెరిగీ పెరిగా ఆఖరిగా విశ్వాస్ రావ్ దేవ్ రూ.2 కోట్ల 5 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. దీంతో గ్రామంలో ఎన్నికలు లేకుండానే విశ్వాస్ రావ్ దేవ్ ను సర్పంచ్ గా ఎన్నుకోనున్నారు. ఈ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామంలో రామేశ్వర స్వామి దేవాలన్ని నిర్మించాలనుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్ పోస్టును వేలం వేయటాన్ని ఎవరో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది వేలం పాటు వెలుగులోకి వచ్చింది.
కాగా..మహారాష్ట్రంలోని 34 జిల్లాల్లో 14, 234 పంచాయితీలకు జనవరి 15న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని గ్రామాల్లో సరపంచ్ పదవులు దక్కించుకోవటానికి గ్రామస్తులు బేరసారాలు జరుపుతున్నారు. దీంతో ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు అపహాస్యం అవుతున్నాయని సామాజిక కార్యకర్త, రచయిత జయదేవ్ డోలే ఆవేదన వ్యక్తంచేశారు.
మనమంతా ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నాం..ప్రజా ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలి.. వేలం వేయకూడదు. పదవులు వేలం వేసే సరుకులు కాదని అన్నారు. ఇలా పదవులు వేలం వేయటం పట్ట పగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని వాపోయారు. కానీ..ఇలా సర్పంచ్ పదవులు వేలం వేయటం గ్రామానికి ఉపయోగకరంగా ఉంటోందని..వేలం వేయగా వచ్చిన డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు ఇలా వేలం వేస్తున్న కొన్ని గ్రామాల వాసులు.