Siddipet
Siddipeta-Medak: రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. నిద్రలోనే పోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే చనిపోయాడని మనం అప్పుడప్పుడు వింటుంటాం. దీనినే వైద్య భాషలో కార్డియాక్ అరెస్ట్, సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అని పిలుస్తారు. ఈ సమస్యతోనే ఒక వ్యక్తి కూర్చొని తింటుండగా ప్రాణం కోల్పోయాడు. ఎవరూ చూడకపోవడంతో 24 గంటల పాటు ఎలా కుర్చున్నాడో అలానే మృతదేహం ఉండిపోయింది. తెలంగాణలో మెదక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46) అనే వ్యక్తి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో తన దగ్గరి బంధువు అంత్యక్రియలకు గురువారం మధ్యాహ్నం హాజరయ్యాడు. అక్కడి నుండి తూప్రాన్ మీదుగా తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సాయిలు తూప్రాన్ పురపాలక పరిధి అల్లాపూర్ వద్ద ఆగాడు. తాగేందుకు మద్యం.. తినేందుకు రొట్టె తీసుకొని తూప్రాన్-గజ్వేల్ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చుని మద్యం తాగేందుకు సిద్దమయ్యాడు.
ముందుగా రొట్టె తినేందుకు చేతిని దాని మీద పెట్టగా ముక్కు, నోటి నుండి రక్తం కారుతూ అలానే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తిని దూరం నుండి ఎవరు చూసినా కూర్చొని తింటున్నాడనే అనుకుంటారు కనుక ఎవరు దగ్గరకి రాలేదు. అలా ఒకరోజు మొత్తం గడిచిపోయింది. అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తి ఇంకా రాలేదని అనుమానపడిన సాయిలు కుటుంబం శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు, కుటుంబసభ్యులు వెతుకుతుండగా సాయిలు మృతదేహం కనిపించింది. చనిపోయి 24 గంటలు గడవడంతో కూర్చున్న స్థితిలోనే మృతదేహం బిగుసుకుపోయింది.