Medak District
Medak District: సహజంగా వేసవి కాలం నుండి వర్షాకాలం మొదలయ్యే రోజుల్లో పల్లెల్లో పాములు కనిపిస్తుంటాయి. వాగులు, వంకలు, నదులు వంటివి వర్షపు నీటితో పారుతుంటే పాములు పుట్టల నుండి బయటకి వస్తుంటాయి. నదీ పరివాహాక ప్రాంతాలలో ఈ పాముల బెడద ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. వాగులు, నదులు దగ్గరలో లేకున్నా ఓ ఊరిలో ఇంటి ముందున్న మోరీ నుండే డజన్ల కొద్ది పాములు బయటకి వస్తున్నాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామంలోని కుమ్మరి శంకరయ్య అనే వ్యక్తి ఇంటి ముందు గత మూడు రోజుల నుండి వరసగా పాములు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల వారు గుమిగూడడం వాటిని చంపేయడం పరిపాటిగా మారింది. అయితే.. గురువారం రాత్రి సమయంలో ఏకంగా 15 పాములు ప్రత్యక్షమవడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోజూ ఈ పాములు ఎక్కడ నుండి వస్తున్నాయో వెతకడం మొదలుపెట్టిన ప్రజలు శంకరయ్య ఇంటి ముందున్న మోరీ నుండే బయటకి వస్తున్నాయని నిర్ధారించుకున్నారు.
మోరీలో నుండి మిగిలిన పాములను బయటకి తీసి చంపేసిన గ్రామస్థులు ఆ గ్రామంలో మిగిలిన మోరీలను కూడా వెతకడం మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఎక్కడ నుండో నీటితో పాటు వచ్చిన పాములు మోరీలో ఆవాసం ఏర్పరుచుకొని ఒక్కొక్కటిగా బయటకి వచ్చినట్లుగా గ్రామస్థులు చెప్తున్నారు.