ఈ షూస్ వేసుకుంటే కరోనా సచ్చినా రాదేమో..!

These Shoes Are A Metre Long: కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టీకా వచ్చినా కరోనా ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదనే చెప్పాలి. పలుదేశాల్లో మరోసారి కరోనా తీవ్రత పెరిగింది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే టీకాతో పాటు తప్పనిసరిగా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మాస్కు ధరించడం. మరో ప్రధానమైన జాగ్రత్త భౌతికదూరం.

ఇంటి నుంచి బయటకు వెళితే మాస్కు మస్ట్. అలాగే భౌతికదూరం పాటించడం మర్చిపోకూడదు. ఈ జాగ్రత్తలు అందరూ పాటిస్తే కరోనాను తరిమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, జనాలంతా ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. చాలామంది మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఉన్నా.. వాటిని జేబులో మడిచిపెట్టారు. భౌతిక దూరం మర్చిపోయారు. ఇలాంటి నిర్లక్ష్యంతో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

కాగా, ప్రముఖ షూస్ కంపెనీ అడిడాస్(adidas) రూపొందించిన బూట్లు ధరిస్తే, కరోనా సచ్చినా రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడిడాస్ ప్రత్యేకంగా రూపొందించిన షూస్ ని చూస్తే మీరూ.. అవుననే అంటారేమో. ఈ షూస్ ఏకంగా మీటర్ పొడవు ఉన్నాయి. ప్రముఖ హిప్ హాప్ ఆర్టిస్ట్ టామీ క్యాష్ (Estonian rapper Tommy Cash) వీటిని డిజైన్ చేశాడు. సూపర్ స్టార్ క్యాంపెయిన్ కోసం అడిడాస్ తో టామీ క్యాష్ చేతులు కలిపాడు. ఇందులో భాగంగా ఈ బూట్లను డిజైన్ చేశారు.

ప్రపంచంలోనే పొడవైన షూస్ ఇవి. ఏకంగా మీటర్ పొడవున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతికదూరం పాటించేందుకు గాను ఈ షూస్ డిజైన్ చేసినట్లు తెలిపాడు. ఇది లిమిటెడ్ ఎడిషన్ షూ. ఒక షూ బ్లాక్ కలర్ లో మరో షూ వైట్ కలర్ లో ఉన్నాయి. లిమిటెడ్ జతలు మాత్రమే ఉన్నాయి. ర్యాఫెల్ (raffle) లో అందుబాటులో ఉన్నాయి. టామీ క్యాష్ సహకారంతో డిజైన్ చేసిన అడిడాస్.. వాటిని ఆవిష్కరించింది.

ఇప్పుడీ షూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొడవైన బూట్లు చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వావ్, నమ్మలేకపోతున్నాం అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి షూస్ వేసుకుంటే, చచ్చినా కరోనా రాదని కామెంట్ చేస్తున్నారు. భౌతికదూరం పాటించేందుకు సూపర్ ఐడియా అని కొందరు అంటున్నారు.

అదే సమయంలో విమర్శలు చేసే వారూ లేకపోలేదు. ఈ షూస్ ఎందుకూ పనికిరావు అంటున్నారు. ప్రాక్టికల్ గా ఈ షూస్ వాడటం అసాధ్యం అంటున్నారు. ఇంత పొడవాటి షూస్ వేసుకుంటే.. పాదాన్ని లేపడం సాధ్యం కాదని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు