భారత ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్ లో పర్యటించారు. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం జరిగిన ఈ అకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం CDF Chief బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. భారతీయ సైనికులను కలువనున్నారు. ఇటీవలే చైనా సైనికులు జరిపిన దాడిలో భారతీయ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.
అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సైనికులు, ఆయుధాలను చైనా భారీగా మోహరిస్తుడడంతో..ధీటుగా భారత్ స్పందిస్తోంది. ఈ క్రమంలో అందరి చూపు ప్రధాని మోడీ పర్యటనపై నెలకొంది. సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు.
అంతేగాకుండా టాప్ కమాండర్లతో సమావేశమై..తీసుకుంటున్న..తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. చైనా సైనికులు జరిపిన దాడిలో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించనున్నారని తెలుస్తోంది. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు ఓ గట్టి సందేశాన్ని ఇవ్వడంలో భాగంగా మోడీ అక్కడ పర్యటించారని సమాచారం. 2020, జూన్ 15న గల్వాన్ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.
తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.