పెళ్లి ఖర్చులకు డబ్బు లేదని తల్లి, కూతుళ్ల ఆత్మహత్య
- madhu
- Published On : December 10, 2020 / 10:33 AM IST
Mother and Two Daughters suicide : ఖమ్మంలో తీవ్ర విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. పెళ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదం నింపింది. గోపాలపురం ప్రకాశ్, గోవిందమ్మ దంపతులు ఖమ్మం పట్టణంలోని గాంధీచౌక్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు రాధిక, రమ్య ఉన్నారు. ప్రకాశ్ మహబూబాబాద్‌లో బంగారం మెరుగుపెట్టే పని చేస్తున్నాడు. ప్రకాశ్ పెద్ద కుమార్తె రాధికకు జనగామ జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యింది. జనవరి 11న వారి వివాహానికి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన పనులు చేస్తున్నారు.
ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పెళ్లి ఖర్చుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. రోజులు గడుస్తున్నా..డబ్బులు చేతికి అందకపోవడం, ముహూర్త సమయం దగ్గరపడుతుండటం, అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు మనస్తాపానికి గురయ్యారు. 2020, డిసెంబర్ 09వ తేదీ ఉదయం ఎప్పటిలాగానే ప్రకాశ్..పనికి వెళ్లాడు. అప్పటికే మనస్థాపానికి గురయిన..తల్లి, ఇద్దరు కూతుళ్లు..ఇంట్లో ఉన్న బంగారం మెరుగుపరిచేందుకు ఉపయోగించే రసాయనాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రాత్రి 10 గంటలకు ప్రకాశ్ ఇంటికి వచ్చాడు. తలుపు ఎంత కొట్టినా తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులను బద్దలుకొట్టి చూడగా ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో ప్రకాశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
