Tirupati: తల్లికోసం వెతుకుతుండగా అనాధ శవాలలో.. హృదయ విదారక ఘటన!

కరోనా చేయని విధ్వంసం లేదు.. మనుషులు చూడని హృదయవిదారక ఘటనలు లేవు. సొంత తల్లిదండ్రులు, కన్న బిడ్డలకు కూడా కడసారి చూపు దక్కని ఘటనలు కోకొల్లలు. అసలు ఆసుపత్రికి వెళ్లిన మనిషి ఎక్కడ ఉన్నాడో..

Tirupati

Tirupati: కరోనా చేయని విధ్వంసం లేదు.. మనుషులు చూడని హృదయవిదారక ఘటనలు లేవు. సొంత తల్లిదండ్రులు, కన్న బిడ్డలకు కూడా కడసారి చూపు దక్కని ఘటనలు కోకొల్లలు. అసలు ఆసుపత్రికి వెళ్లిన మనిషి ఎక్కడ ఉన్నాడో.. మరణిస్తే మృతదేహం ఏమైందో కూడా లెక్కలు లేని సందర్భాలు మరెన్నో. కుటుంబాలకు కుటుంబాలే ఈ మహమ్మారి బారిన పడితే.. అందులో ఉన్నదెవరో.. చనిపోయినదెవరో కూడా మిగతా సభ్యులు తెలుసుకోలేని దుస్థితి. తిరుపతిలో మహమ్మారి మిగిల్చిన హృదయ విదారక ఘటన ఒకటి కంటతడిపెట్టిస్తుంది.

తిరుపతి కొర్లగుంటలో నివసించే 62 ఏళ్ల లక్ష్మీదేవికి కుమారుడు సురేంద్ర, కోడలు ఉన్నారు. ముగ్గురూ ఒకేసారి కరోనా బారినపడగా కొద్దిరోజులు హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. కానీ.. ముగ్గురికి శ్వాస ఇబ్బందితో ఈనెల 14న రుయా ఆస్పత్రికి వెళ్లారు. కానీ లక్ష్మీదేవికి మాత్రమే బెడ్ లభించింది. దీంతో కుమారుడు, కోడలు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కానీ రెండు రోజులకు రూ.1.60 లక్షల బిల్లుతో భయపడి కరోనా నెగటివ్ రాకముందే ప్రాణాలకు తెగించి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంట్లో నుండి కదల్లేని స్థితిలో తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీసే అవకాశం లేకుండా పోయింది.

చివరికి కుమారుడి ఆరోగ్యం కొంచెం మెరుగయ్యాక తల్లి కోసం ఆరా మొదలుపెట్టాడు. ఆసుపత్రికెళ్తే సమాధానం దొరకలేదు. కానీ.. వాలంటీర్, సెక్టోరల్‌ అధికారి లక్ష్మీదేవి ఈనెల 19న లక్ష్మీదేవి చనిపోగా అనాథ శవాలతో పాటు అంత్యక్రియలకు ఇచ్చేశామని తెలిపారు. దీంతో భార్యను వెంటపెట్టుకొని అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన శ్మశానానికి వెళ్లారు. కానీ.. అప్పుడే 16 అనాథ శవాల అంత్యక్రియల కోసం ముస్లిం ఐకాస సభ్యులు అక్కడకి వచ్చారు.

ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి వారి వెంట ఉండగా ఓసారి శవాలను పరిశీలిస్తామని సురేంద్ర సెక్టోరల్‌ అధికారిని కోరడంతో సరేనన్నారు. సురేంద్ర అనుకున్నట్లే ఆ మృతదేహాల్లో లక్ష్మీదేవి మృతదేహం ఉండడంతో బోరున విలపించారు. సురేంద్ర దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. చివరికి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ముస్లిం ఐకాస సభ్యులు ఓదార్చి సురేంద్ర సమక్షంలోనే తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.