Munugode by poll : బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు .. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత..

మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Munugode by poll : మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు బీజేపీ కార్యకర్తలు వాగ్వాదం పెట్టుకున్నారు. మర్రిగూడెం పరిథిలో స్థానికేతరులు చాలామంది ఉన్నారని..వారిని పంపించివేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేసారు.  స్థానికేతరులను వెంటనే పంపించాలని, అప్పటి వరకు పోలింగ్ ఆపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో మర్రిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు.

దీంతో బీజేపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోనే కాదు మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ జరుగనున్న క్రమంలో మునుగోడు నుంచి స్థానికేతలు వెళ్లిపోవాలని నల్లగొండ కలెక్టరే స్వయంగా చెప్పారు. కానీ జరిగేది వేరుగా ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లోను స్థానికేతరులు ఉన్నారని..ముఖ్యంగా మర్రిగూడెం పోలింగ్ కేంద్రం పరిధిలో చాలామంది స్థానికేతలకు ఉన్నారని వారిని పంపించేయాలని డిమాండ్ చేసే తమపై పోలీసులు లాఠా చార్జ్ చేయటం దారుణం అంటూ వాపోయారు. పోలీసులు అధికార పార్టికి కొమ్ముకాస్తున్నారని అక్రమంగా బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ వాపోయారు.

కాగా..కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాలకు చెందిన 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు కాగా, 80 ఏళ్లు దాటిన వారు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 105 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.







                                    

ట్రెండింగ్ వార్తలు