CJI NV Ramana : న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అవసరం

కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మంది ఉన్నారని, న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

CJI NV Ramana  కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మంది ఉన్నారని, న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్‌ అవసరమని పేర్కొన్నారు. తనతోపాటు కొత్తగా న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన 9 మంది జడ్జీలకి ఆదివారం సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. . రిజర్వేషన్‌ మీ హక్కు.. దాన్ని డిమాండ్‌ చేయడానికి మీరు అర్హులు అని మహిళా న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

ఎన్వీ రమణ మాట్లాడుతూ..దిగువ కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30శాతం కంటే తక్కువే. హైకోర్టుల్లో అది 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రం మాత్రమే ఉన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అవసరం. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య అని అన్నారు. దేశంలోని 1.7 మిలియన్ల న్యాయవాదులు ఉండగా.. అందులో 15శాతమే మహిళలు. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరని నేను ప్రశ్నిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆశించారు.

కోర్టుల్లో మహిళా న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎన్వీ రమణ అన్నారు. న్యాయస్థానాల్లో మహిళా న్యాయవాదులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. దేశంలోని 22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆదివారం కుమార్తెల దినోత్సవం సందర్భంగా మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. ఇది అమెరికా సంస్కృతి అయినా.. కొన్ని మంచి విషయాలను ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్వీ రమణ అన్నారు. మరోవైపు, దసరా అనంతరమే కోర్టుల్లో ప్రత్యక్ష విచారణకు అనుమతిస్తామని సీజేఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోర్టులు తెరవడం వల్లనే కరోనా థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌ వచ్చాయని ప్రజలు అనవచ్చని.. అందుకే థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌వేవ్‌లు రాకూడదని ఆశిద్దామంటూ ఎన్వీ రమణ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు