చీకట్లో ఉంచి పూజలు.. ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త కోణం

new twist in bpharmacy student suicide case: కిడ్నాప్, రేప్ డ్రామా ఆడి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని… ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనమైంది. షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆమెపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉండ‌డం, రేప్ డ్రామా ఆడినందుకు ప‌రువుపోతుంద‌నే భ‌యంతోనే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అయితే, విద్యార్థిని మరణం వెనుక మిస్టరీ నెలకొంది.

అసలేం జరిగింది..? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?
ఈ కేసులో అసలేం జరిగింది..? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇప్పటికే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా మరో కోణం బయటపడింది.

కిడ్నాప్ డ్రామా ఘటన జరిగిన తర్వాత వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోలేదట. అలా ఆహారం లేకుండానే విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు సమాచారం. దీంతో విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు తెలుస్తోంది.

షుగర్ మాత్రలు మింగి:
కాగా.. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనే మంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. బుధవారం(ఫిబ్రవరి 24,2021) ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత యువతి అమ్మమ్మ ఇంటిదగ్గరే అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తంగా ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. మిస్టరీని చేదించే దిశగా పోలీసులు ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

అసలేం జరిగిందటే..
ఫిబ్రవరి 10న సాయంత్రం 6.30కు బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌ అయిన వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోడ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి, ఘట్‌కేసర్‌ వైపు తీసుకెళ్తున్నాడంటూ సదరు యువతి డయల్‌-100కు ఫోన్‌ చేసింది. వెంటనే కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. రెండు గంటల తర్వాత ఆమెను గుర్తించారు. తాను రేప్‌కు గురయ్యానంటూ ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే అన్ని ఆధారాలను సేకరించాక పోలీసులకు డౌట్ వచ్చింది. దీంతో ఆ యువతిని నిలదీయగా.. ఆమె డ్రామా బయటపడింది. అదంతా కట్టుకథ అని తేలింది. తనకు ఇంట్లో తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని, ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉందని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని తెలిస్తే.. తల్లిదండ్రులే వదిలించుకుంటారని అలా చేసినట్లు ఒప్పుకొంది. అందులో భాగంగానే నాటకం ఆడినట్లు చెప్పింది. ఆటోడ్రైవర్‌పై నిందలు వేయడానికి కారణం అడగ్గా.. లాక్‌డౌన్‌ సమయంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎక్కువ చార్జీ వసూలు చేస్తూ.. పొగరుగా మాట్లాడినట్లు తెలిపింది. ఇరికించాలనే అతని ఫొటోను ఇచ్చినట్లు చెప్పింది.

చివరికి 19ఏళ్ల బీఫార్మసీ విద్యార్థిని కేసు విషాదాంతమైంది. కిడ్నాప్, రేప్ కేసులో తీవ్ర విమర్శల పాలైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీస్ శాఖను తప్పుదోవ పట్టించినందుకు గాను ఆమెకు శిక్ష పడే అవకాశముంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు