కొత్త ఏడాదిలో క్రికెట్ పండుగ : భారత్, ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్

  • Publish Date - December 11, 2020 / 08:23 AM IST

India-England tour schedule : త్వరలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా పడగా.. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో ఆట మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ టూర్‌లో ఇంగ్లండ్ 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.



కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్‌తో క్రికెట్ మ్యాచ్‌లను మొత్తం 4 స్టేడియాల్లోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చెన్నైలో తొలి టెస్టు జరగుండగా.. 13 నుంచి 17వ తేదీ వరకు అదే చెన్నై స్టేడియంలో రెండో మ్యాచ్ జరగుంది. అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28 వరకు మూడో టెస్ట్ జరగనుండగా.. చివరిదైన డే నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.



ఐదు టీ20 మ్యాచ్‌లను అహ్మదాబాద్ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. మార్చి 12, 14, 16, 18, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూణె వేదికగా మార్చి 23, 26, 28వ తేదీల్లో 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుందని బోర్డు షెడ్యూల్ వెల్లడించింది.  శ్రీలంకలోని బయో బబుల్ నుంచి చెన్నైలోని బుడగలో అడుగుపెడుతున్న ఇంగ్లాండ్ జట్టు వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది. అయితే..పెద్దగా ఆంక్షలు పెట్టకుండానే..ఇంగ్లాండ్ జట్టుకు ప్రాక్టిస్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు.



శ్రీలంకలో ఇంగ్లాండ్..రెండు టెస్టులు ఆడనుంది. భారత పర్యటనలో మాత్రం వార్మప్ మ్యాచ్ లు నిర్వహించడం లేదు. ఆసీస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత..టీమిండియా క్రికేటర్లకు వారం రోజుల పాటు రెస్ట్ ఇవ్వనున్నారు. అనంతరం ఆటగాళ్లకు టీఆర్ టి – పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే…బుడగలోకి అనుమతినిస్తారు.